నీళ్లున్నా.. గొంతు తడవదు !

6 Nov, 2013 02:30 IST|Sakshi

 పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు  ప్రజల తాగునీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు రూ. 2.17 కోట్లతో పట్టణ శివార్లలోని కొత్తపల్లె మార్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారు. పింఛా ఏటి నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నింపి, ఆ నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు తరలించి, అక్కడి నుంచి ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పింఛా ఏటిపై పీలేరు-సదుం మండలాల సరిహద్దు ప్రాంతంలోని బాలంవారిపల్లె సమీపంలో రూ.2 కోట్లతో గార్గేయ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పీలేరు సమ్మర్‌స్టోరేజ్‌కి నీటిని తరలించి పట్టణ ప్రజలకు తాగునీరు,  దాదాపు 5 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం.
 
 నిర్మాణ పనులు పూర్తైఐదేళ్లు కావస్తున్నా  ఆ దిశగా ఎలాంటి పురోగతి కానరాలేదు. మరోవైపు కాలువల నిర్మాణం కోసం భూసేకరణ గతంలోనే పూర్తైది. ఉన్నతమైన ఆశయంతో పెద్దిరెడ్డి  పీలేరు తాగునీటి సమస్య తీవ్రతను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి  వివరించి సమ్మర్‌స్టోరేజ్, గార్గేయ ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపుగా తాగునీటి సమస్య  పరిష్కారమవుతుందని అం దరూ సంబరపడ్డారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లడంతో ఆశయం కార్యరూపం దాల్చలేదు.
 
  మహానేత మరణానంతరం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  సమ్మర్ స్టోరేజ్‌కి నీటి తరలింపు కోసం చేస్తున్న ప్రతిపాదనలు  కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటి ఎద్దడితో ప్రజలు అలమటించాల్సి వస్తోంది.  ఆరునెలల కిందట   మంచినీటి సమస్య జఠిలంగా మారడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో బోర్లు డ్రిల్ చేసినా అది ఫలప్రదం కాలేదు.  దాహార్తి తీవ్రతను గుర్తించి రాజకీయాలకతీతంగా సమ్మర్ స్టోరేజ్‌కి ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ వేసి నీటిని తరలించాలని  పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు