తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యం

31 Aug, 2023 07:46 IST|Sakshi

హైదరాబాద్: మహా నగరానికి సురక్షిత తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నీటి క్లోరినేషన్‌ నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమిస్తోంది. ప్రభుత్వం నీటి శుద్ధి చేసేందుకు క్లోరిన్‌ గ్యాస్‌పై రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. ఆచరణ అమలు మేడిపండు చందంగా మారింది. మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి చివరి సర్వీస్‌ రిజర్వాయర్‌ వరకు క్లోరినేషన్‌ నిర్వహణ అంతంత మాత్రంగానే మారింది. ఫలితంగా నీటిలో తగిన మోతాదులో క్లోరిన్‌ మెయింటెన్‌ కాకుండానే సరఫరా కావడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

నది నుంచి నీరు రిజర్వాయర్‌కు చేరే క్రమంలో మట్టి, ఇతరత్రా వ్యర్థాలు కలిసి వస్తుండటంతో ప్రతి పాయింట్‌కు నీటి శుద్ధి అవసరం ఉంటుంది. క్లోరినేషన్‌ సరిగా జరగకపోవడంతో రిజర్వాయర్‌ అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి బ్యాక్టీరియా, ఇకొలి వైరస్‌కు కారణమవుతున్నాయి. మరోవైపు రిజర్వాయర్లలో చేరిన మట్టి క్లోరిన్‌ను తినేస్తోంది. క్లోరినేషన్‌ చేయకుండా నీరు సరఫరా కావడంతో జనం వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు గురికాక తప్పదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

మూడంచెల క్లోరినేషన్‌ నామమాత్రమేనా?
కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నదుల నుంచి తరలిస్తున్న జలాలపై మూడంచెల క్లోరినేషన్‌ ప్రక్రియ అంతంతగా తయారైంది. నదుల నుంచి మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల మీదుగా సర్వీస్‌ రిజర్వాయర్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు నీరు సరఫరా అవుతోంది. మొదటి విడతగా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాట్‌ (డబ్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల (ఎంబీఆర్‌) వద్ద, చివరగా సర్వీస్‌ రిజర్వాయర్ల వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కానరాని మెయింటెనెన్స్‌..
► నీటి సరఫరా క్లోరిన్‌ మెయింటెనెన్స్‌ ప్రశ్నార్థకంగా తయారైంది. రిజర్వాయర్‌ వద్ద కోర్లిన్‌ రెండు పీపీఎం (పార్ట్‌ పర్‌ మిలియన్‌) మెయింటెన్‌ జరగాలి. నల్లా ద్వారా వినియోగదారుడికి నీరు చేరే సమయంలో కచ్చితంగా అందులో 0.5 పీపీఎం క్లోరిన్‌్‌ మెయింటెన్‌ కావాల్సి ఉండగా ఆచరణలో లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి సరఫరా సమయంలో కోర్లిన్‌ శాతంపై ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

► రిజర్వాయర్‌లో నీటిలో క్లోరిన్‌ ప్రభావం తగ్గగానే తిరిగి కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. క్లోరిన్‌ శాతం నిర్దేశించిన దానికంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్లే. క్లోరిన్‌ ప్రభావం లేని కారణంగా సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది నీరు ప్రజా ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. నీటి శాంపిల్‌ సర్వేలో మాత్రం పలు రిజర్వాయర్‌ పరిధిలో క్లోరిన్‌ మెయింటెన్‌ కావడంలేదని బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు ఔట్‌లెట్‌ టాప్‌ వద్ద సైతం క్లోరిన్‌ నిల్‌గా ఉండటం నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది.

లాగ్‌బుక్‌ నిర్వహణేదీ?
సర్వీస్‌ రిజర్వాయర్లలో లాగ్‌బుక్‌ నిర్వహణ మొక్కుబడిగా తయారైంది. కేవలం ప్రధాన పాయింట్‌ మినహా మిగతా పాయింట్లల్లో ఎప్పటికప్పుడు లాగ్‌బుక్‌లో నమోదు లేదు. వారానికోసారి నమోదు చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నిబంధనల ప్రకారం ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి వచ్చి చేరే నీటి ప్రవాహంలో క్లోరిన్‌ శాతంతో పాటు దిగువ నీటిని విడుదల చేసే సమయంలో క్లోరిన్‌ శాతాన్ని లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వీస్‌ రిజర్వాయర్‌ నుంచి లైన్‌లకు నీటిని సరఫరా జరిగే సమయంలో సైతం క్లోరిన్‌ శాతాన్ని లాగ్‌ బుక్‌లో నమోదు చేయాలి. గంట గంటకూ నమోదు చేయాల్సి ఉండగా ఆచరణలో మాత్రం అమలు కావడంలేదని తెలుస్తోంది.

30 నిమిషాల ముందే..
సర్వీస్‌ రిజర్వాయర్‌ నుంచి లైన్‌కు సరఫరా చేసే అర్ధ గంట ముందు క్లోరిన్‌ గ్యాస్‌ను నీటిలో విడుదల చేయాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా తయారైంది పరిస్థితి. ప్రతి లైన్‌కు క్లోరిన్‌ శాతం పరిశీలించి సరఫరా చేయాల్సి ఉండగా.. నీటి ప్రవాహంలోనే క్లోరిన్‌ గ్యాస్‌ కలిసేటట్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో క్లోరిన్‌ శాతం హెచ్చు తగ్గులై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు