రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్‌సిగ్నల్‌

23 Sep, 2023 04:09 IST|Sakshi

చెన్నై, రాయలసీమకు అవసరమైన తాగునీటి సరఫరా పనులకు ప్రాధాన్యత

2,913 క్యూసెక్కుల సామర్థ్యం చొప్పున ఆరు పంపుల ఏర్పాటు 

రాష్ట్ర జలవనరుల శాఖఉత్తర్వులు

జూన్, జూలై మధ్య 59 టీఎంసీలను తరలించడం ద్వారా చెన్నై, రాయలసీమకు నీటి సరఫరా

పర్యావరణ అనుమతి వచ్చేలోగా ఈ పనులు పూర్తిచేసే దిశగా చర్యలు 

సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్‌ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 

శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది.

ఈ హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కా­ర్‌ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లందడంలేదు.

అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం..
ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్‌ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి.

అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించా­లని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికా­రుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 

పర్యావరణ అనుమతితోనే పనులు
రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వా­యర్‌ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.

పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘా­తం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో టీడీపీ నేతలు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఎన్జీటీ నియమించిన జా­యింట్‌ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావర­ణ అనుమతితోనే పనులు చేపట్టా­లని 2020, అక్టోబర్‌ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాం­తో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధి­కారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు