ఎమ్మెల్యే భార్యే అయినా...

12 Jul, 2017 03:23 IST|Sakshi

సాలూరు: ఆయనో ఎమ్మెల్యే. ఆయనకు గానీ... ఆయన కుటుంబ సభ్యులకు గానీ చికిత్స చేయించాలంటే ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లొచ్చు. కానీ సహజంగానే నిరాడంబరుడైన సాలూరు ఎమ్మెల్యే(వైఎస్సార్‌సీపీ) పీడిక రాజన్నదొర మాత్రం స్థానిక ప్రభుత్వాస్పత్రిలోనే తన సతీమణికి చికిత్స చేయించిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్నదొర సతీమణి రోజారాణి పాచిపెంట మండలంలో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె మంగళవారం ఉదయం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డుపై అకస్మాత్తుగా పాము కనిపించడంతో కంగారుపడి కిందపడ్డారు.

ఈ దశలో ఆమె తల వెనుకభాగం, కాలు, చేతులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం సంకోచించకుండా ఆమెను సాలూరు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రామ్మూర్తి, అప్పలనాయుడు ప్రధమచికిత్స చేసి, తదుపరి వైద్యపరీక్షల కోసం విజయనగరం తరలించాలని సూచించడంతో ఆయన విజయనగరానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భార్యను వైద్యం కోసం సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులున్నా, ఆక్కడికి వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంపైనా, వైద్యులపైనా వున్న నమ్మకమే కారణమని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు