అక్రమాలపై మంత్రి పీతల ఫైర్

12 Mar, 2016 11:40 IST|Sakshi
సాక్షి కథనంతో కదులుతున్న డొంక
మిగిలిన 100 గజాలూ వేరే వారికి రిజిస్ట్రేషన్
రంగంలోకి పోలీసులు
 
నరసాపురం అర్బన్ :తూర్పు గోదావరి జిల్లా  నరసాపురం పట్టణంలో సంచలనం కలిగించిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై స్త్రీ,శుశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సీరియస్ అయ్యారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని గురువారం పోలీసులను ఆదేశించారు. పట్టణానికి చెందిన అన్నదమ్ములు నర్సింహారావు, ఈశ్వరరావులను మంత్రి పేరుతో మోసగించి వారి ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముఠా గురించి ‘సాక్షి’ గురువారం సంచికలో ‘మంత్రి పేరుచెప్పి భూమి హాంఫట్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పీతల సుజాత స్పందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇలాంటి వ్యవహారాలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా.. తన పేరును నిందితులు వినియోగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై కూపీ లాగడం మొదలుపెట్టారు. ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా దీనిపై సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో మిగిలిన వంద గజాల స్థలాన్ని కూడా అక్రమార్కులు వేరేవారికి అమ్మేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మొత్తం 300 గజాల స్థలాన్ని ముందుగా ఓ మహిళపేరున గతనెల 16న పవర్ ఆఫ్ అటార్నీతో నిందితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. వెంటనే మర్నాడు 17న అందులో 200 గజాల స్థలాన్ని బాధితుల తమ్ముడు కొడుకు భరత్ పేరున రిజిస్ట్రేషన్ జరిగింది.
 
దీంతో ఇంకా మిగిలిన వంద గజాల స్థలం రిజిస్ట్రేషన్ ఆపాలని బాధితులు నరసాపురం సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ స్థలం కూడా ఈనెల 3న పాలకొల్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నరసాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు పూర్తిగా డీలా పడ్డారు. ఈ వ్యవహారంపై బాధితుల తరపున ఆందోళన చేపడతామని సీపీఎం నరసాపురం డివిజన్, పట్టణ కార్యదర్శులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు  ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మరిన్ని వార్తలు