పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు

10 Jan, 2014 01:00 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రతినెలా ఇచ్చే అరకొర పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నానా అగచాట్లు పడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే తలుపు తట్టి మరీ పింఛన్లు అందించేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అప్పగించడం, వాటికి తోడు ఆధార్ అనుసంధానం, పీఓటీడీ (పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డివైస్) పరికరాలు పెట్టి వేలిముద్రలు సరిచూస్తుండటంతో లబ్ధిదారుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీసులు లేకపోవడంతో పింఛన్ల కోసం 5 నుంచి పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, వికలాంగులకు అది మరింత భారంగా మారుతోంది.

 జిల్లాలో మొత్తం 3,13,569 మంది పెన్షన్ అర్హులున్నారు. వీరిలో 33,269 మంది వికలాంగులు, 127 మంది కల్లుగీత కార్మికులు, 1,72,671 మంది వృద్ధులు, 6,722 మంది చేనేత కార్మికులు, 82,958 మంది వితంతువులు, 17,764 మంది అభయహస్తం పెన్షన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌పోస్టుమాస్టర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు నగరం, కందుకూరు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ పెన్షన్‌లను పంపిణీ చేస్తోంది. వీరికి  రూ 10,17,60,200లను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. వీరిలో 65 వేల మందికి పైగా వృద్ధులకు, వితంతువులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో జనవరి నుంచి వీరికి పెన్షన్‌లు అందవు. గతంలో ఐకేపీ డీపీఎం సంతకం చేస్తే ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్‌లు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

 చీరాల నియోజకవర్గ పరిధిలో దేశాయిపేట పంచాయతీలో ఒకటో వార్డు పింఛన్‌దారులు పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అదేవిధంగా పాతరెడ్డిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం, బొచ్చులవారిపాలెం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు రామన్నపేట, వేటపాలెం పోస్టాఫీసులకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు.

 యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పెద్దదోర్నాల మండలంలో వృద్ధుల వేలిముద్రలను పీఓటీడీ యంత్రాలు అంగీకరించకపోవడంతో మండల ఏపీ ఆన్‌లైన్ కోఆర్డినేటర్ సమక్షంలో పింఛన్లు తీసుకోవాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌లో సైతం తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్రిపురాంతకంలో విద్యుత్ కోత, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సర్వర్లు పనిచేయక పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

  దర్శి నియోజకవర్గంలో 22514 మంది పింఛన్‌దారులుండగా వారిలో 5622 మందికి ఆధార్ కార్డులు లేక రెండు నెలలుగా పింఛన్లు పొందలేకపోతున్నారు. ముండ్లమూరు మండలంలో వేములబండ, రమణారెడ్డిపాలెం, అయోధ్యనగర్, రాజగోపాలరెడ్డి నగర్, పలుకురాళ్ల తండా, నందమూరి నగర్, బసవాపురం, జగత్‌నగర్, శ్రీనివాసా నగర్, తమ్మలూరు, సుంకరవారిపాలెం గ్రామాల పింఛన్‌దారులు నాలుగు కిలోమీటర్లు కాలినడకన పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.  
 గిద్దలూరు పోస్టాఫీసులో పింఛన్లు తీసుకునేందుకు గురువారం వచ్చిన వృద్ధులు పలువురు జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

 కందుకూరు మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో రోజుకు నలుగురైదుగురికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి తరువాత రండి అంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారు.
 కొండపి నియోజకవర్గం టంగుటూరు పంచాయతీ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రావివారిపాలెం, బాపూజీ కాలనీ, వెంకటాయపాలెం వారు టంగుటూరు పోస్టాఫీసుకు రావాల్సిందే.  
  కనిగిరి  నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో కొత్తగా 615 మంది దరఖాస్తు చేసుకున్నా..వారికి ఇంకా మంజూరు కాలేదు.  పీఓటీడీ మిషన్లకు సిగ్నల్ అందక  అవస్థలు పడుతున్నారు.  
  పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో కొందరికి ఆగస్టు నెల పింఛన్లు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. యద్దనపూడి మండలంలో పోస్టాఫీసుల వద్ద పీఓటీడీ మిషన్లకు సిగ్నల్స్ సరిగా అందక లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా చార్జింగ్ లేదనే సాకుతో లబ్ధిదారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండేలా చేస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
 ఒంగోలు నగరంలో పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోంది. ప్రతినెలా 7వ తేదీలోపు పింఛన్లు అందించాల్సి ఉన్నా..15వ తేదీ వరకూ ఇస్తున్నారు. నగర పరిధిలో ఆధార్ కార్డులు లేక వెయ్యి మంది జనవరి నుంచి పింఛన్లు కోల్పోయారు.

 సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తిలో పింఛన్‌దారులు ఎక్కడ పింఛన్లిస్తారో స్పష్టత లేక పోస్టాఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్న పనితోనే సతమతమవుతుంటే పింఛన్ల పంపిణీ  పేరుతో తమపై అదనపు భారం మోపుతున్నారని గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే జీతం తక్కువ..పనిభారం ఐదు రెట్లు పెంచి తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు