‘జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది’

28 Sep, 2014 16:47 IST|Sakshi
‘జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది’

విశాఖపట్నం: నిజాయితీగా తీర్పులివ్వకపోతే జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. చుండూరు నరమేధంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ‘జడ్జీల నియూమకం-వారి జవాబుదారితనం’పై విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జరిగింది. ముందుగా అంబేద్కర్ భవన్ నుంచి రామాటాకీస్, ఆశీల్‌మెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సదస్సులో తారకం మాట్లాడారు. చుండూరు కేసులో నిందితులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారనే కారణాన్ని చూపుతూ హైకోర్టు జడ్జి వారిని విడుదల చేస్తూ తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన   నేపథ్యంలో నిందితులకు తిరిగి శిక్ష అమలు పడేలా చూస్తామన్నారు.

ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కో-ఆర్డినేటర్ కంచర్ల శేషు, విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు చలసాని ప్రసాద్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ రామారావు, ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యుడు జె.వి.ప్రభాకర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ, జనచైతన్యమండలి ప్రతినిధి ఎల్.కృష్ణ, అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు