రచ్చ రచ్చ

11 Jan, 2019 07:18 IST|Sakshi
వేపాడ: పీకేఆర్‌ పురం గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో రోడ్డుపై నిలబడిన గ్రామస్తులు

జిల్లాలో జన్మభూమి గ్రామసభలు రసాభాస

సభలు నిర్వహించకుండా అడ్డుకుంటున్న జనం

ఎక్కడ చూసినా నిలదీతలు... నిరసనలే...

పాలకపక్షనాయకులపై విరుచుకుపడుతున్న వైనం

కురుపాం, వేపాడ మండలాల్లో సభల బహిష్కరణ

జన్మభూమి సభలంటేనే జనం మండిపడిపోతున్నారు. ఎక్కడి కక్కడే అడ్డుకుని పాలకపక్ష నాయకులు, అధికారులనునిలదీస్తున్నారు. సమస్యలుపరిష్కరించని సభలెందుకంటూ నిరసిస్తున్నారు.మరికొన్ని చోట్ల ఏకంగా సభలు నిర్వహించవద్దంటూబహిష్కరించడం...అధికారులు ఊళ్లోకి రాకుండాముళ్లకంపలు అడ్డంగావేయడం వంటి నిరసనలుచోటు చేసుకున్నాయి.

విజయనగరం గంటస్తంభం: జన్మభూమి కార్యక్రమం చివరి దశకు చేరుకునే సరికి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోం ది. జిల్లాలో గురువారం నిర్వహించిన సభల్లో ఎక్కువగా నిలదీతలు.. నిరసనలు కనిపించాయి. గ్రామసభలకువెళ్లే నేతలను, అధికారులను అడ్డుకోవడం, జన్మభూమి మాకొద్దంటూ బహిష్కరించడంతో నిరసన తెలిపారు. సభ జరిగిన చోట గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదని నిలదీతలు చోటు చేసుకున్నాయి. జెడ్పీ ఛైర్మన్, చీపురుపల్టి, గజపతినగరం ఎమ్మెల్యేలకు ఈ పరాభవం తప్పలేదు. గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంత మందికే అందజేస్తున్నారని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును గ్రామస్తులు నిలదీశారు.  దత్తిరాజే రు మండలం టి.బూర్జవలసలో నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా అర్హులైన వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయలేదని, పంటలు పోయి రైతులు కొట్టు మిట్టాడుతున్నా కరువు మండలంగా ప్రకటించలేదని , గోకులాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు మంత్రి అప్పలనాయుడు మండల ప్రత్యేక అధికారి పాండు రంగారావు దృష్టికి తెచ్చారు.

గుర్ల మండలం చింతపల్లిపేటలో జన్మభూమిలో అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులను గ్రామ మాజీ సర్పంచ్‌ జమ్ము అప్పలనాయుడు నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో ఆంధ్రా పెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగి కె.కె.ఎం.నాయుడు  నిలదీశారు.
బొబ్బిలి మున్సిపాలిటీ మల్లంపేటలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తూనిక, తేమ కొలిచే విధానంలో  రైతులను మోసం చేస్తున్నారని ప్రత్యేక అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మహిళలు ఆరోపించారు.
పార్వతీపురం మునిసిపాలిటీ 14వ వార్డులో ప్రతిపక్ష కౌన్సిలర్‌ ప్రాతినిధ్యం వహించడంతో ఒక్క ప్రజా ప్రతినిధికూడా హాజరుకాలేదు. వార్డు ప్రజలు సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే పాలకులు ఎవరూ ఈ వార్డుకు హాజరుకానట్లు తెలిసింది.
కురుపాం నియోజకవర్గంలో వనకాబడి గ్రామంలో జరిగిన జన్మభూమిని గ్రామస్తులు బహిష్కరించారు. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేని జన్మభూమి ఎందుకని కార్యక్రమాన్ని బహిష్కరించారు. అలాగే గోడివాడ పంచాయతీలో కూడా సమస్యలు పరిష్కరించలేని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకంటూ గ్రామస్తులు కార్యక్రమానికి హాజరైన అధికారులను అడ్డుకున్నారు. మరో దారి లేక అధికారులంతా వెనుదిరిగారు. సాలూరు మండలం నెల్లిపర్తి గ్రామంలో సమస్యలపై అధికారులను నిలదీయడంతో పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేపాడ మండలం పి.కె.ఆర్‌.పురం గ్రామంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు మాకు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులను గ్రామంలోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించని సభలు వద్దని మొండికేశారు. శంగవరపుకోట మండలం దారపర్తిలో రోడ్డు పేరుతో గిరిజనులను ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ దారపర్తి గిరిశిఖర పంచాయతీ గ్రామాల గిరిజనులు, యువకులు జన్మభూమి సభలో అధికారులను నిలదీశారు.

మరిన్ని వార్తలు