మాది కొల్లేరు.. మా బతుకులు కన్నీరు

25 May, 2018 07:15 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి మంచినీటి సమస్యను వివరిస్తున్న కొల్లేరు ప్రజలు

పసర్లు పట్టిన నీళ్లతో అవస్థ పడుతున్నాం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కొల్లేరు వాసుల ఆవేదన

సమస్య పరిష్కరిస్తానని జననేత భరోసా

పశ్చిమగోదావరి ,భీమడోలు: కొల్లేరు వాసులం.. గుక్కెడు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్నాం.. మంచినీటి చెర్వుల్లోని నీళ్లు పసర్లు పట్టి దుర్వాసన కొడుతున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాం. పలుసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొల్లేరు వాసులు, మహిళలు   వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో గురువారం కొనసాగిన ప్రజాసంకల్ప పాదయాత్రలో జీఆర్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గోలి సుబ్బారావు ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాలైన ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో తరలి వచ్చి కొల్లేరు సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఏకరువు పెట్టారు.

ఆగడాలలంక గ్రామంలో పసర్లు పట్టి దుర్వాసన కొడుతున్న నీటిని ప్లాస్టిక్‌ బాటిల్‌లో  పట్టి జగన్‌కు చూపించారు. ఆయన చలించిపోయారు. గ్రామంలో ఆక్వా చెర్వులు విస్తరించడం వల్ల ఆ కలుషిత నీరు గోదావరి కాల్వ ద్వారా మంచినీటి చెర్వుల్లో చేరుతోందని వాపోయారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల తామంతా ఆనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. ఈ గ్రామాల్లో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 30 ఎకరాల భూమిని సేకరించి చెర్వును తవ్వి నీటిని అందించాలని వారంతా వేడుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచినీరు ఇవ్వలేని చేత కాని ప్రభుత్వమన్నారు. అందరి ఆశీర్విదంతో మన ప్రభుత్వం రాగానే కొల్లేరు వాసులకు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను మండల స్థాయి అధికారులకు తెలియజేయాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించడంతో వారంతా భీమడోలు ఎంపీడీఓ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు.

ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన
కొల్లేరు వాసులంతా పసర్లు పట్టిన నీటి బాటిళ్లతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఎంపీడీఓ ఏవీ విజయలక్ష్మికి పరిస్థితిని వివరించారు. తాము ఎమ్మెల్యే మాటలను నమ్మడం లేదని, అధికారులు హామీ ఇచ్చేంతవరకు వెళ్లబోమని ఆందోళన చేశారు. మా గ్రామాల్లోని మంచినీటి సమస్యను పరిష్కరించేందకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని గోలి సుబ్బారావు, సైదు గోపాలకృష్ణ, ఘంటసాల అప్పయ్య, మహిళలు భలే నాగమణి, సైదు భవానమ్మ హెచ్చరించారు. నెల రోజులుగా మంచినీటి చెర్వులో నీరు రంగు మారిన పట్టించుకోవడం లేదని వాపోయారు. శుక్రవారం నుంచి గ్రామాలకు ఫిల్టర్‌ చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొల్లేరు వాసులు ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు