అందరి చూపు.. ప్రజా సంకల్పం వైపు

6 Nov, 2017 10:07 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి సోమవారం ప్రారంభించనున్న ప్రజాసంకల్ప యాత్రకు అన్నివర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు.

అధిక ధరల పీడన.. సమస్యల యాతన.. గిట్టుబాటు ధర అందని రైతన్న.. పట్టెడన్నం కోసం పాట్లు పడుతున్న పేదన్న.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వైపు వేయికళ్లతో చూస్తున్నారు. హామీలతో గద్దెనెక్కిన పాలకులు.. జనం బాధలు తీర్చకపోగా, ప్రజావ్యతిరేక విధానాలతో కన్నీరు పెట్టిస్తున్న వైనంపై అడిగేందుకు, కడిగేసేందుకు ప్రజల మధ్యకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వస్తున్నారని కుండబద్ధలు కొడుతున్నారు. విద్యావంతులు, మేధావులు, వివిధ సంఘాల పెద్దలు జనం గొంతుకగా జగన్‌ గర్జించనున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాదయాత్రను స్వాగతిస్తున్నాం
ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు వెల్లడించాలి. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 9 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. – బొడ్డు నాగేశ్వరరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ  

వాస్తవాలను తెలుసుకునేందుకు ఉపయుక్తం
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్ర చేయడం అభినందనీయం.  ప్రజాసంకల్పం ప్రజల సమస్యలు చర్చించే వేదిక కావాలి. పాదయాత్రలో ఎక్కువ మంది రైతుల్ని కలిసి, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాసంకల్ప యాత్ర వల్ల వైఎస్‌ జగన్‌ ప్రజలకు మరింత చేరువ అవుతారు.
– ఎర్నేని నాగేంద్రనా«ధ్, రైతు సంఘం నాయకుడు

ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం
ప్రజాసంకల్పం యాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి ప్రజలతో మమేకం అయ్యే అవకాశం వచ్చింది. ప్రజల కష్టసుఖాలను ఆయన ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది. న్యాయవాదుల సమస్యలను ఆయనకు వివరిస్తాం. విజయవాడ వచ్చినప్పుడు మేము ఆయన్ను 4000 మంది సభ్యులు ఉన్న బార్‌ అసోసియేషన్‌కు ఆహ్వానిస్తాం.          
 – సోము కృష్ణమూర్తి, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి

ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసేటట్లు చేయాలి. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న గందరగోళంపై ప్రజలకు ఆయన ఈ యాత్రలో స్పష్టంగా వివరించారు. ఈ యాత్ర ద్వారా కేంద్రంపైనా ఒత్తిడి పెంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చేటట్లు చేయాలి.
– కొలనుకొండ శివాజీ, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్‌

పాదయాత్ర హర్షణీయం
ప్రజాసమ్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత పాదయాత్ర హర్షణీయం. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఈ పాదయాత్ర ద్వారా మరింత ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వం డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దుచేసేటట్లు కృషి చేయాలి. మద్యం నియంత్రణపై దృష్టి పెట్టాలి.
–పెమ్మత్స దుర్గాభవాని, ఆంధ్రప్రదేశ్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం ఆటంకాలు కలిగించకూడదు
ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే దిశగా సాగాలి. ఈ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన ఆటంకాలు కలిగించకూడదు. పాదయాత్ర సందర్భంగా మద్యం పాలసీని మార్చడం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం, డ్వాక్రా రుణాలు పూర్తిగామాఫీ చేయడం తదితర మహిళా సమస్యలపై చర్చిస్తే, మహిళలకు ఉపయుక్తంగా ఉంటుంది.
– అక్కినేని వనజ, మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు

సమస్యలు తెలుసుకోవడానికి దగ్గరిదారి
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడం మంచి పరిణామం. యాత్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటానికి దగ్గరి మార్గం. సమస్యలను క్షేత్రస్థాయిలో చూసి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. – ఆజ్మీరు వీరభద్రయ్య,  రసమయి సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జగ్గయ్యపేట

ప్రజా సంకల్ప యాత్ర మంచిదే
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6 నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నా. ఈ యాత్రలో ప్రజల కష్ట, నష్టాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వారి జీవన స్థితిగతులు తెలుసుకోవచ్చు. – కె.సూర్యారావు, రిటైర్డ్‌ హెచ్‌ఎం

>
మరిన్ని వార్తలు