రహదారులు పూలబాటలై..

17 Aug, 2018 07:41 IST|Sakshi
ఎర్రవరం జంక్షన్‌ నుంచి యరకంపేట క్రాస్‌ వద్ద జన సందోహం మధ్య సంకల్ప సూరీడు జగన్‌మోహన్‌రెడ్డి

చీరలపై నడిపించిన పల్లెవాసులు

మంగళహారతులు పట్టిన మహిళలు

సమస్యలు విన్నవించుకున్న జనం

జగన్‌పై ఆప్యాయత కురిపించిన ప్రజలు

నాతవరం మండలంలో సాగిన పాదయాత్ర

సాక్షి, విశాఖపట్నం: పల్లెపోటెత్తింది. అభిమానం వెల్లివిరిసింది. ఆప్యాయతానురాగాల మధ్య జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర సాగింది. మహిళలు మంగళహారతులతో జగనన్నకు బ్రహ్మరథం పట్టారు. దారులన్నీ పూలబాటై జగన్‌ పాద స్పర్శ కోసం ఎదురుచూశాయి. ఆ అడుగు పడగానే మురిసిపోయాయి. కల్మషం లేని పల్లెజనం కురిపించిన ప్రేమకు జననేత రెట్టించిన ఉత్సాహంతో వారి ని అక్కున చేర్చుకున్నారు. మరో వైపు గడిచిన నాలుగున్నరేళ్ల టీడీపీ దుర్మార్గ పాలనలో విసిగిపోయిన జనం తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల కక్ష సాధిం పు చర్యలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విరామం ప్రకటించిన ప్రజా సంకల్ప యాత్ర గురువారం యథావిధిగా ప్రారంభమైంది. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా ప్రజలతో మమేకమయ్యారు.

డి.ఎర్రవరం సమీపంలో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 7.50 గంటలకు బయల్దేరిన జననేత వెంట వేలాది మంది అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. గురువారం పాదయాత్ర ఎర్రవరం మీదుగా ఎరకంపేట జంక్షన్, ములగపూడి శివారు వరకు సాగింది. ములగపూడిలో అయితే దారిపొడవునా పూలబాట పర్చారు. కిలోమీటర్‌కు పైగా చీరలు రోడ్డుపై పరిచి ఆ చీరలపై నడిపించారు. జననేతను చూసేందుకు పల్లెవాసులు పోటీపడ్డారు. స్కూల్‌కు వెళ్లే చిన్నారుల నుంచి పండుముసలి వరకు ప్రతి ఒక్కరూ రోడ్డుకిరువైపులా బారులు తీరి మరీ జగన్‌ను చూసి పులకించిపోయారు. జగనన్ను చూస్తే కానీ స్కూల్‌కు వెళ్లనంటూ పలువురు చిన్నారులు మారాం చేయడంతో వారిని జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి మరీ చూపించారు. చిన్నారులను దగ్గరకు తీసుకొని నుదిటపై ముద్దాడి బాగా చదువుకోవాలంటూ దీవించారు. ఇక యువత, మహిళలు, చిన్నారులు ఆయనతో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కర్ని పలుకరిస్తూ.. వారి సమస్యలు వింటూ జననేత ముందుకు సాగారు.

పింఛన్లు తీసేశారన్నా...
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ పింఛన్లు తొలగించారంటూ అత్యధిక సం ఖ్యలో జననేత జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌ అభిమానులమని, వైఎస్సార్‌సీపీకి చెందిన వారమని, గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని అం టూ పింఛన్లు ఇవ్వడం లేదన్నా.. అంతేకాదన్నా చివరకు మీ ఫ్లెక్సీ పెట్టినందుకు కూడా మా పింఛను తీసేశారన్నా అంటూ బాధితులు జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. పింఛన్లు ఒకటే కాదు వైఎస్సార్‌సీపీ అభిమానులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదన్నారు. రుణాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తాండవ కాలువ నిర్మించడం వలనే తమ భూములు సస్యశ్యామలం అయ్యాయని నాతవరం మండల రైతులు జగన్‌ వద్ద మహానేతను స్మరించుకున్నారు. అలాగే కాలువను కాస్త పొడిగిస్తే మరింత ఆ యకట్టుకు నీరందుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ ఓ బూటకమని రైతులు, డ్వాక్రా మహిళలు జననేతకు వివరించా రు.

జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ మన ప్రభుత్వం రాగానే మీ అందరికి మేలు జరుగుతుంద ని భరోసా ఇచ్చారు. రెండోరోజు పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం, నర్సీపట్నం కో ఆర్డినేటర్‌ పెట్ల ఉమాశంకర గణేష్, అనకాపల్లి పార్లమెంటు జి ల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున,  ఏటికొప్పాక షుగర్స్‌ మాజీ చైర్మన్‌ చంటిబాబురాజు, సీఈసీ సభ్యులు అంకంరెడ్డి జమీలు, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్‌ రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పసుపుల బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు జి.సుబ్బరాజు, టి.అశోక్‌కుమార్‌రెడ్డి, నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సీహెచ్‌. సువర్ణలత, రుత్తల ఎర్రాపాత్రుడు, రాయపురెడ్డి నాగేశ్వరరావు, కరక అప్పలరాజు, డాక్టర్‌ పి.వి.లక్ష్మీకాంత్, సిరసపల్లి శేఖర్, అల్లవరపు నాగమల్లేశ్వరి, తాడి విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.

గోడు చెప్పుకున్న గిరిజనం
డి.ఎర్రవరం దాటగానే ఎరకంపేట క్రాస్‌ వద్ద గొలుగొండ మండలం చందరాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తాము గిరిజనులమైనప్పటికీ మైదాన ప్రాంతంలో ఉండడంతో ఐటీడీఏ పథకాలేవి తమకు వర్తంచడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కులేకుండా పోయిందని వాపోయారు. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేయాలని కోరారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనందరి ప్రభుత్వం రాగానే మైదాన ప్రాంత గిరిజనులకు కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు