మా ఇసుకతో మీ వ్యాపారమా?

14 Dec, 2014 01:31 IST|Sakshi

మోటుమాల (కొత్తపట్నం): మండలంలో ఇసుక రీచ్‌లు వివాదంగా మారుతున్నాయి. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకంలో ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని కొద్దికాలంగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని భావించడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మోటుమాలలో ఇసుక రీచ్‌ను కలెక్టర్ విజయకుమార్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం ప్రారంభించారు. ఇసుక తవ్వకంతో ఐదు గ్రామాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.

కలెక్టర్‌ను కలవనీయకుండా ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు జత కలిశారు. అర్జీలిచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు ప్రజలను నెట్టి బయటకు పంపారు. దీనికి ముందు మహిళలు, గ్రామస్తులు ఎవరూ సభకు రావొద్దని ఎస్సై బి.నరసింహారావు హెచ్చరించారు. ఒకరినో, ఇద్దరినో అనుమతిస్తానని చెప్పారు. దీంతో వారికి కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకుండా పోయింది.
     
కలెక్టర్ రీచ్‌ను ప్రారంభించి వెళ్లిన తర్వాత ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్‌ను అడ్డుకుని స్థానిక మహిళలు దాని డోర్లు ఊడదీసి ఇసుకను పారబోసారు. ఈ సందర్భంగా మోటుమాల సర్పంచ్ పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల ఎంపీటీసీ కోడూరి సులోచన మాట్లాడుతూ 1996కు ముందు పాదర్తి, మోటుమాల గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగాయని, 1996 తర్వాత సర్వే నం.465లో 115 ఎకరాలు మోటుమాల పంచాయతీకి అప్పటి కలెక్టర్ శర్మ అప్పగించారని వివరించారు.   
 
రహస్యంగా ఐకేపీ అధికారుల కమిటీ
రహస్యంగా అధికార పార్టీ అండతో పాదర్తి గ్రూపు సంఘాలతో కమిటీ వేశారని ప్రజలు వాపోతున్నారు. పాదర్తి గ్రామానికి 26 గ్రూపులు, మోటుమాల 68 గ్రూపులున్నాయి. ఈ భూమి 1996లో అప్పటి కలెక్టర్ శర్మ మోటుమాలకు ఇచ్చినట్లు ఉత్తర్వులన్నాయి. తమ  గ్రామాన్ని పక్కనబెట్టి పాదర్తికి అనుమతి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని డీఆర్‌డీఏ పీడీని మహిళలు ప్రశ్నించారు. తవ్వకాలు ఆపకుంటే ట్రాక్టర్లను అడ్డుకుంటామని గ్రామస్తులు, మహిళలు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు