వైఎస్సార్‌సీపీలోకి పేరం నాగిరెడ్డి

26 Dec, 2013 02:44 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలోకి పేరం నాగిరెడ్డి

భారీ సంఖ్యలో అనుచరులతో కలసి చేరిన
తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్
నాగిరెడ్డి కోడలు సరోజమ్మను పార్టీ
తాడిపత్రి అభ్యర్థిగా ప్రకటన
జేసీ సోదరులు టీడీపీలోకి వస్తారన్న ప్రచారాన్ని
బాబు ఖండించకపోవడం దారుణం: పేరం నాగిరెడ్డి


 పులివెందుల, న్యూస్‌లైన్: తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పేరం నాగిరెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. టీడీపీ అభ్యర్థిగా నాలుగైదు సార్లు నాగిరెడ్డి జేసీ సోదరులపై పోటీ చేశారు. అయితే, జేసీ సోదరులు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరుతున్నారన్న ప్రచారాన్ని చంద్రబాబు ఖండించకపోవడం, టీడీపీ నేతలే జేసీ సోదరులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారం నేపథ్యంలో మనస్తాపం చెందిన నాగిరెడ్డి భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి... వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో నాగిరెడ్డి, ఆయన కుమారుడు గోకుల్‌రెడ్డితోపాటు పలువురు పార్టీలో చేరారు

 చంద్రబాబు తీరు వల్ల మనస్తాపం..: నాగిరెడ్డి

 తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ సోదరులు టీడీపీలోకి వస్తున్నారని, స్వయంగా టీడీపీ నాయకులే వారిని ఆహ్వానిస్తున్నారని పత్రికల్లో వచ్చినా.. చంద్రబాబు స్పందించకపోవడం తనను మనస్తాపానికి గురి చేసిందని పేరం నాగిరెడ్డి పేర్కొన్నారు. 25 ఏళ్లుగా జేసీ సోదరులపై పోటీ చేస్తూ వస్తున్నానని.. ఎన్నో దౌర్జన్యాలు, సవాళ్ల మధ్య టీడీపీ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోయానని, దాదాపు గెలిచినంత పని చేశానని.. అయినా, టీడీపీ అధినాయకత్వం పిలిచి గెలుపునకు సంబంధించిన సూచనలు, సలహాలు చేయలేదని పేర్కొన్నారు.

కాగా, వైఎస్‌ఆర్ ఆశయాలు నెరవేర్చడానికి జగన్‌ను సీఎం చేయాలని రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని... తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వైఎస్సార్ సీపీ బలంగా కనిపిస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి మరింత మంది వైఎస్సార్‌సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు చోట్ల గెలవాలనుకుంటూ విభజనకు లెటర్ ఇచ్చారని.. దాని ఆధారంగా కాంగ్రెస్ విభజనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఒక ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు.

 తాడిపత్రి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా సరోజమ్మ..

 వీఆర్ రామిరెడ్డి కుమార్తె, పేరం నాగిరెడ్డి కోడలు, గోకుల్‌రెడ్డి సతీమణి సరోజమ్మను వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌సీపీలోకి నాగిరెడ్డి చేరికను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ.. అభినందిస్తున్నానని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గ బాధ్యతలను సరోజమ్మ చేపడుతుందని.. ఆమెను గెలిపించే బాధ్యతను వీఆర్ రామిరెడ్డి, పేరం నాగిరెడ్డిలు తీసుకోవాలని, వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కాగా.. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం నాయకులు వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు