పైసలిస్తేనే పర్మినెంట్!

9 Nov, 2013 02:30 IST|Sakshi

శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్:  కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయడం అంటే దరఖాస్తు చేస్తే సరిపోతుందా? దీనికి కొన్ని ఖర్చులుంటాయి... ఎవరి వాటాలు వారికి ఇవ్వాల్సిందే... మీరిచ్చిన డబ్బులు ఇక్కడ ఒక్క దగ్గరే ఉండిపోతాయనుకుంటున్నారా ఏంటీ? ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పై స్థాయి అధికారులకు ఎవరి వాటాలు వారికి ఇవ్వాలి. ఎవరి వాటాలు వారికి అందితే అంతా సక్రమంగా ఫైల్ నడుస్తుంది. లేదంటే మధ్యలోనే ఆగిపోయి వెనక్కి వస్తోంది. ఇక మీ ఇష్టం. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కాంట్రాక్ట్ కార్యదర్శులను నమ్మిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... కాంట్రాక్టు కార్యదర్శులను పర్మినెంట్ చేస్తామని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొన్ని మెలికలు పెట్టింది. ఈ మెలికలే వసూళ్లకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో 156 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో డిగ్రీ అర్హత ఉన్న వారు 135 మంది.

వీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 4వ తేదీ వరకు గడువు విధించింది. మిగిలిన 30 పోస్టులకు ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికీ కాంట్రాక్టు కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 25 శాతం మార్కులు అదనంగా కేటాయిస్తారు. అంటే దాదాపుగా వీరందరికీ పర్మినెంట్ అవుతుందని అధికార వర్గాల సమాచారం. అయితే దరఖాస్తు చేయడం, సెలక్షన్ కమిటీ ఎంపిక తదితర ప్రక్రియలు ఉండడంతో వసూళ్లకు అస్కారమిచ్చినట్లైందని ఆ శాఖ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఈ లొసుగుల్ని అధారంగా కాంట్రాక్టు కార్యదర్శుల నుంచి రూ 50 వేల నుంచి రూ లక్ష వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధమైందన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. డీపీవో కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పనుల్లో చక్రం తిప్పే ఓ ఉద్యోగి అక్రమ వసూళ్లకు బీజం చేశాడని సమాచారం. పై స్థాయి జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి వరకు వాటాలు ఇవ్వాలని నమ్మబలుకుతున్నట్లు భోగట్టా.

ఇది ఎంతవరకు నిజమో కానీ కాంట్రాక్టు కార్యదర్శులు మాత్రం ఇన్నాళ్లు సర్వీసు చేసిన వాళ్ల దగ్గర నుంచి కూడా వసూళ్లు చేయడం దారుణమని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు