ఎర్రచందనం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్

8 Jan, 2014 03:41 IST|Sakshi
ఎర్రచందనం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్

     8,500 మెట్రికల్ టన్నుల అమ్మకానికి డీజీఎఫ్‌టీ అనుమతి
     ఫలించిన ఆరేళ్ల సుదీర్ఘ ప్రయత్నం
     {పభుత్వానికి భారీ ఆదాయం
     ఈ-ఆక్షన్‌కు అటవీశాఖ కసరత్తు
     స్మగ్లింగ్‌కు అడ్డుకట్టపడుతుందని అధికారుల ఆశ


 సాక్షి, హైదరాబాద్:  స్మగ్లర్లపై దాడులు చేసి పట్టుకున్న ఎర్రచందనం విక్రయానికి అనుమతించాలంటూ ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు 8,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతికి కేంద్రం అనుమతించింది. సుదీర్ఘ సంప్రదింపులు, ముఖ్యమంత్రి మొదలు అధికారుల వరకు పలుమార్లు సమర్పించిన వినతుల అనంతరం ఎర్రచందనాన్ని దుంగల రూపంలో ఎగుమతి చేసేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జెనీవా కేంద్రంగా ఉన్న కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ (సైటీస్) అనుమతించిన మేరకు 8,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతికి అనుమతిస్తున్నట్లు తాజాగా డీజీఎఫ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో అటవీశాఖ దీని విక్రయానికి ఈ-ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. టెండర్ నిబంధనల రూపకల్పన కోసం నిపుణుల కమిటీ వేయాలని నిశ్చయించింది. కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ-ఆక్షన్‌కు నోటిఫికేషన్ వెలువడుతుంది.

 ప్రభుత్వానికి భారీ రాబడి..

 ఎర్రచందనం విక్రయం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన (ఎ-గ్రేడ్) ఎర్రచందనం టన్ను ధర రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పలుకుతోంది. టన్ను రూ. 20 లక్షలనుకుంటే 8,500 టన్నులకు  రూ.1,500 కోట్లు వస్తుంది. అయితే ఈ దుంగలు ఏళ్ల తరబడి ఎండకు ఎండి, వానకు తడవడంవల్ల నాణ్యత దెబ్బతింది. అందువల్ల ఇవి ‘ఎ’ గ్రేడ్ కిందకు రావు. నిల్వ సమయం పెరిగేకొద్దీ రంగు, ఆకట్టుకునే తత్వం కోల్పోతాయి. అందువల్ల ప్రభుత్వం విక్రయించే వాటికి అంత ధర రాదు. టన్నుకు సగటున రూ. పది లక్షలు వచ్చినా రూ.750 కోట్ల ఆదాయం రావచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.

 గ్లోబల్ టెండర్లతో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట

 గ్లోబల్ టెండర్ల (ఈ-ఆక్షన్) ద్వారా ఎర్రచందనం విక్రయిస్తే స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అటవీశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘అక్రమంగా నరుకుతున్న, రవాణా చేస్తున్న వారిపై దాడిచేసి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 11,800 మెట్రిక్ టన్నులు గోదాముల్లో ఉంది. దీనిని చట్టబద్ధంగా విక్రయిస్తే అంతర్జాతీయంగా ఉన్న డిమాండు తీరుతుంది. దీంతో ధర పడిపోతుంది. ధర తగ్గడం, న్యాయమైన మార్గంలో కొనే అవకాశం ఉన్నందున స్మగ్లర్ల నుంచి కొనడానికి అంతర్జాతీయ సంస్థలు వెనుకంజ వేస్తాయి. దీంతో సహజంగానే స్మగ్లింగ్ తగ్గిపోతుంది. వానకు తడిసి, ఎండకు ఎండి కుళ్లిపోయే బదులు మావద్ద ఉన్న ఎర్రచందనాన్ని ఎగుమతి చేయడం ఏవిధంగా చూసినా ఉత్తమమే. ఎర్రచందనం విక్రయం ద్వారా వచ్చే రాబడిని అరుదైన అడవుల పరిరక్షణకు వినియోగించవచ్చు. డీజీఎఫ్‌టీ అనుమతితో 2004-05లో మొదటిసారి 1,100 టన్నులు విక్రయించాం. తర్వాత రెండేళ్లు స్మగ్లింగ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ 2007-08 నుంచి డిమాండు పెరగడంతో స్మగ్లింగ్ ఎక్కువైంది’ అని అటవీశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
 

మరిన్ని వార్తలు