సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి నానా రభస..

2 Feb, 2020 12:31 IST|Sakshi

సాక్షి, ఆత్మకూరు : కారుకు సైడు ఇవ్వమని అడిగారన్న కోపంతో బొలెరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి... కారులో వెళుతున్న వారిని వెంటాడి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన ఏఎస్‌పేట మండలంలో శనివారం  చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేద పండితులుగా పనిచేస్తున్న విఘ్నేష్‌కుమార శర్మ తన కుటుంబసభ్యులతో కారులో ఏఎస్‌పేట మండలంలోని గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మవరం వద్ద ఓ బొలేరో వాహనం దారికి అడ్డుగా ఉండడంతో విఘ్నేష్‌కుమార్‌ హారన్‌ మోగించాడు. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు.

బొలేరో వాహన డ్రైవర్‌ మద్యం మత్తులో కారులో ఉన్నవారిని దుర్భాషలాడుతూ వాహనాన్ని అడ్డు తొలగించాడు. పట్టించుకోని విఘ్నేష్‌కుమార్‌ తన కారును గుంపర్లపాడు వైపునకు పోనిచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఆ బొలేరో వాహనంలో ఉన్న వ్యక్తి తన వాహనంతో వీరి వాహనాన్ని వెనుకనే తరుముకుంటూ దారి పొడవునా హారన్‌ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. విఘ్నేష్‌కుమార్‌ కుటుంబ సభ్యులు మొత్తానికి గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. వీరి వెనుకనే వచ్చిన బొలేరో వాహనందారుడు విఘ్నేష్‌కుమార్‌ బంధువుల ఇంట్లోకి వెళ్లి తన సెల్‌ఫోన్‌తో మహిళలని కూడా చూడకుండా అందరి పొటోలు తీస్తూ నా వాహనానికి అడ్డు తగులుతారా అని బెదిరించి దుర్భాషలాడాడు.


కారును వెంబడించిన బొలేరో వాహనం 
గ్రామస్తులు గమనించి బొలేరో వాహనదారుడిని మందలించేందుకు ప్రయత్నించారు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, తనను ఏమైనా అంటే అంతుచూస్తానని మద్యం మత్తులో నానాయాగి చేశాడు. దీంతో గ్రామస్తులు ఏఎస్‌పేట పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి అతడ్ని బైక్‌పై తీసుకుని వెళ్లారు. బొలేరో వాహనం ఏసుబాబు అనే వ్యక్తిదిగా గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు సీఐ పాపారావును సంప్రదించగా తాను పూర్తి విషయాలు తెలుసుకుని విచారణ చేస్తానని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు