సాయంత్రం 6 దాటితే నో పెట్రోల్‌

26 Apr, 2017 08:07 IST|Sakshi
సాయంత్రం 6 దాటితే నో పెట్రోల్‌

ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకే పెట్రోలు బంకులు
నిర్వహణ వ్యయం భరించలేకే ఈ నిర్ణయం
ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ వెల్లడి
కొత్త బంకుల మంజూరుపై నియంత్రణకు పట్టు
ప్రభుత్వం, మార్కెటింగ్‌ కంపెనీలు దిగివస్తే.. నిర్ణయంపై పునఃసమీక్ష


సాక్షి, అమరావతి: పొద్దున్నే ఇంటి నుంచి బయద్దేరే ముందే వాహనంలో పెట్రోల్, డీజిల్‌ ఉందో లేదో సరి చూసుకోండి.. సాయంత్రం ఆఫీసు, వ్యాపార కార్యకలాపాలు ముగించుకున్నాక తీరిగ్గా పెట్రోల్‌ కొట్టించుకుందాంలే అనుకుంటే ఇంతే సంగతులు.. ఎందుకంటే ఇకమీదట సాయంత్రం ఆరు దాటితే పెట్రోలు బంకులు పనిచేయవు మరి.. మే మూడో వారం నుంచి రాష్ట్రంలో పరిమిత గంటల్లో మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేయనున్నాయి. మే 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇవి పనిచేస్తాయి. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్వహణ వ్యయం పెరిగిపోతుండటంతో 24 గంటలూ బంకులు నడపడం కష్టంగా మారిందని, దీంతో రోజుకు కేవలం 12 గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రావి గోపాలకృష్ణ ప్రకటించారు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు డీలర్ల కమీషన్లు పెంచకపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం డీలర్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో మే 10న అన్ని చమురు కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్‌ కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఇంధన పొదుపులో భాగంగా మే 14న ఆదివారం బంకులను పూర్తిగా మూసివేయనున్నట్టు తెలిపారు.

నిర్వహించలేకపోతున్నాం..
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌కు లీటరుకు రూ.3.33, డీజిల్‌కు రూ.2.30 చొప్పున కమీషన్‌ ఉంటే కానీ బంకులు నిర్వహించడం సాధ్యం కాదని గోపాలకృష్ణ స్పష్టం చేశారు. గత మార్చినెలలో సమ్మె చేసినప్పుడు కమీషన్లు పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన కంపెనీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం డీలర్లకు లీటరు పెట్రోల్‌పై రూ.2.59, డీజిల్‌పై రూ.1.63 చొప్పున కమీషన్‌ను మార్కెటింగ్‌ కంపెనీలు అందిస్తున్నాయన్నారు.

2011లో అపూర్వచంద్ర కమిటీ ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోకుండా విచ్చలవిడిగా కొత్త బంకులకు అనుమతులు మంజూరు చేస్తున్నారని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు కమీషన్లు కూడా పెంచట్లేదని వాపోయారు. అపూర్వచంద్ర కమిటీ నివేదిక ప్రకారం.. నెలకు 1.70 లక్షల కిలోలీటర్లు విక్రయిస్తే కానీ బంకుల నిర్వహణ సాధ్యం కాదని, కానీ ప్రస్తుతం సగటున 1.40 లక్షల కిలోలీటర్లకు మించి అమ్మకాలు జరగట్లేదని గోపాలకృష్ణ చెప్పారు.

అమ్మకాలతో సంబంధం లేకుండా పక్కపక్కనే బంకులు మంజూరు చేస్తుండటంతోపాటు ప్రైవేటు బంకుల పోటీని తట్టుకోలేకపోతున్నామన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లోనే పరిమిత వేళల్లోనే బంకులు నడపాలని నిర్ణయించామని తెలిపారు. ఈలోగా ప్రభుత్వం, మార్కెటింగ్‌ కంపెనీలు దిగివస్తే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు