‘పైకా’ షురూ..

8 Jan, 2014 05:33 IST|Sakshi

పాలమూరు జిల్లాలో పైకా జాతీయ స్థాయి క్రీడాపోటీలను నిర్వహించడం భవిష్యత్ తరాల క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. నాకు ఈ పోటీల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించే  అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది.  మంగళవారం ప్రారంభమైన స్వామి వివేకానంద 6వ జాతీయస్థాయి పైకా క్రీడా పోటీలను పురస్కరించుకొని ఆయన ‘న్యూస్‌లైన్’ తో పలు అంశాలపై మాట్లాడారు. క్రీడల నిర్వహణ గూర్చి ఆయన మాటల్లోనే...
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : పంచాయత్ యువ క్రీడా ఖేల్ అభియాన్ (పైకా) ముఖ్య  ఉద్దేశం గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలుగులోకి తీసుకు రావడమే. అటువంటి పైకా జాతీయ స్థాయి క్రీడాపోటీలను పాలమూరులో నిర్వహించడం సంతోషించ దగ్గ విషయం.
 
 ఈ పోటీలను జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఈనెల 8వ తేది వరకు అర్ధసంవత్సర పరీక్షలు ముగుస్తాయి. 9, 10 తేదిల్లో చిన్నారులు హాజరయ్యే విధంగా ప్రయత్నిస్తున్నాం. ఈ క్రీడా పోటీలను తిలకించి కొందరైనా స్ఫూర్తిపొంది జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని కోరుతున్నాం.
 
 అన్ని విభాగాలూ...
 నాలుగు రోజులపాటు మహబూబ్‌నగర్‌లో చేపట్టనున్న జాతీయ స్థాయి పైకా క్రీడా పోటీలను నిర్వహించేందుకు అన్ని విభాగాలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఛైర్మన్‌గా, నేను కన్వీనర్‌గా ఏర్పడిన క్రీడల నిర్వహణ కమిటీలు పలు అంశాలలో క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు, క్రీడా పోటీలను చేపట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీల్లో ఆర్థిక కమిటీ, రిసెప్షన్ కమిటీ, అకామిడేషన్ కమిటీ, టెక్నికల్ కమిటీ, బోర్డింగ్ కమిటీ, సెరిమోనియల్ కమిటీ, ట్రాన్స్‌పోర్ట్ కమిటీ, మెడికల్ కమిటీ, వాటర్ /శానిటేషన్ కమిటీలుగా నిర్ణయించాం. వీటికి జిల్లాస్థాయి అధికారులను ఒక్కో విభాగానికి కన్వీనర్‌లుగా నియమించి సమర్థవంతంగా పనులు జరిగే విధంగా దృష్టిపెట్టడం జరిగింది.
 
 ఇబ్బందులు అధిగమిస్తూనే..
 ఏపీ క్రీడా సంస్థ నుంచి వచ్చిన నిధులు తక్కువే అయినప్పటికీ.. మన జిల్లాకు దక్కిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇబ్బందులను అధిమిస్తూనే కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేందుకు కృషి చేస్తున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గిరిజాశంకర్ ఇతర వనరుల ద్వారా నిధులను సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే భోజనాల ఏర్పాటులో క్రీడాకారులు, నిపుణులు, నిర్వాహకులను దృష్టిలో ఉంచుకొని వంటకాలు చేయిస్తున్నాం.. సంబంధం లేని వ్యక్తులు కూడా భోజనాలు చేయడం, అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తుండటం కొంత ఇబ్బందిగా మారింది. ఈ రెండు మినహా క్రీడా పోటీల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందుల్లేవు.             
 
 ఈ పోటీల్లో..
 మహబూబ్‌నగర్‌లో నాలుగు రోజులపాటు జరుగనున్న జాతీయ స్థాయి పైకా క్రీడా పోటీల్లో  వాలీబాల్, థైక్వాండో తోపాటు, అథ్లెటిక్స్ విభాగాలలో రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల నుంచి 26 బృందాలు సంసిద్ధత వ్యక్తం చేయగా మంగళవారం ఉదయం వరకు ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటక, కేరళ, మహరాష్ట్ర, మిజోరాం, పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అస్సాం, వెస్ట్‌బెంగాల్ జట్లతోపాటు మరో నాలుగు రాష్ట్రాల జట్లు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారిణుల కోసం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాఠశాల, ఎన్‌టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతి సౌకర్యాలు కల్పించాం. బాలురకు ప్రభుత్వ బాలుర, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలు, రెయిన్‌బో కాన్సెప్ట్ స్కూల్, ఇతర స్కూళ్లలో వసతి కల్పించాం. క్రీడా ప్రాంగణంలో, వసతి కల్పించిన చోట కూడా తగినంత లైటింగ్, తాగునీరు, అవసరమైన అన్ని సౌకర్యాలను ఆయా కమిటీలు ముందస్తుగా ఏర్పాటు చేశాయి. జిల్లాలో చేపట్టిన జాతీయ క్రీడాపోటీలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులకు స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నాం.
 

మరిన్ని వార్తలు