ప్లాస్టిక్‌ను తరిమేద్దాం..

3 Oct, 2019 10:36 IST|Sakshi

పర్యావరణ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. దీనిలో భాగంగా రాజధాని నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చెత్త రీసైక్లింగ్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాప్‌ ఎండీ కాటంనేని భాస్కర్, కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌  కలెక్టర్‌ మాధవీలత, కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ పాల్గొన్నారు.ఈ మేరకు ఇంది ప్రజలతో ‘ప్లాస్టిక్‌ వాడం.. పర్యవరణాన్ని కాపాడుతాం..’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రతిజ్ఞ చేయించారు.

సాక్షి, అమరావతి  : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్లాస్టిక్‌ మన జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్‌ వల్ల మనిషి తినే ఆహారంతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులన్నీ కలుషితమైపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఏటా సగటున 100 కిలోల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇది గ్రామాల్లో పోలిస్తే పట్టణాలు, పురపాలికల్లో ఎక్కువ. జిల్లాలో నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీల్లో రోజుకు సగటున 45 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అలాగే నగర పంచాయతీలైన ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీల్లోనూ రోజు సగటున 10 నుంచి 15 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు 20 శాతం అంటే 20 టన్నుల టన్నుల మేర నిత్యం ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. దీనిలో 40 శాతం వరకు సేకరణకు రాకుండా ఇళ్లలో, రహదారులపై ఉండిపోతోంది. మిగిలిన దాంట్లో కొంత కాల్చివేస్తుండగా.. ఎక్కువ శాతం సేకరించి పేర్చుతున్నారు. 15 నుంచి 20 శాతం మాత్రమే పునరుత్పత్తి జరుగుతోంది.

అత్యధికంగా విజయవాడలోనే..
జిల్లాలో మొత్తం విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు 4 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంటే అందులో దాదాపు 100 టన్నుల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. జిల్లాలో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్‌లో రోజూ 550 టన్నులు ఉత్పత్తి అవుతుండగా.. తర్వాత స్థానం మచిలీపట్నం కార్పొరేషన్‌లో దాదాపు వంద టన్నుల చెత్త ఉత్పన్నమవుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఇతరత్రా వాటిల్లో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించేలా చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.  

‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం.. 
ప్రపంచ వర్తక, వాణిజ్య రంగంలో ముఖ్య భూమిక పోషించిన విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. నగరాన్ని అపరిశుభ్రంగా మార్చుతున్న నిర్లక్ష్యపు నీడల్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ విజయవాడ’కు శ్రీకారం చుట్టింది. బెజవాడలోని ప్రధాన వీధులు మినహా ఇతర వీధుల్లో ముక్కు మూసుకుని పోయే పరిస్థితికి కారణమవుతున్న డంపర్‌ బిన్లను తొలగించింది. ఇంటింటి నుంచి రోజూ చెత్త సేకరించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు పెట్టి పుష్‌కార్ట్‌లు, చెత్త సేకరించే బుట్టలను తీసుకురావడమే కాకుండా.. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో నగరాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలపై దృష్టి సారించింది. ఇది కేవలం అధికారుల చర్యలతో కాదు.. ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది.


ప్రతిజ్ఞ చేస్తున్న సీఎస్‌ సుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ ఇంతియాజ్, శాప్‌ ఎండీ భాస్కర్, జేసీ మాధవీలత తదితరులు

చేయాల్సిందిదీ..
► పాలు, మాంసం లాంటివి తీసుకురావడానికి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే ఓ టిఫిన్‌ బాక్సు తీసుకుపోవాలి. 
► 40 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ సంచులను వాడినా వాటిని మన బాధ్యతగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేలా ప్రయత్నించాలి.
► కూరగాయలు, ఇతరత్రా కొనేటప్పుడే భూమిలో కలిసి పోయే గుణమున్న చేతి సంచినే వినియోగించాలి. 
► వ్యాపారులు, దుకాణాదారుల యజమానులు ప్లాస్టిక్‌ను ఇవ్వకుండా వినియోగదారులకు నచ్చజెప్పేలా మాట్లాడాలి. ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలకు బదులుగా స్టీలు, రాగి వంటి సీసాలు ఉపయోగిస్తే మంచిది.
► పురపాలక సంఘ అధికారులు మొక్కుబడిగా కాకుండా ప్లాస్టిక్‌ నియంత్రణపై చిత్తశుద్ధి కనబర్చాలి. పురపాలికల్లో ఉన్న అన్ని దుకాణాలు, హోటళ్లు ప్లాస్టిక్‌ను నిషేధించేలా వారికి దశల వారీగా కౌన్సెలింగ్‌ కేంద్రాల ద్వార అవగాహన కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలి. 

ప్రతి ఒక్కరూ సహకరించాలి.. 
నగరంతో పాటు, జిల్లా అంతటా ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. నగరంతో పాటు జిల్లాల్లో సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, సూపర్‌ మార్కెట్లు, హోటళ్ల తదితరాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. 
– ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా