విజయవాడలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

24 Nov, 2019 10:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: బెజవాడ శివారు ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డోర్ టు డోర్ సెర్చ్ చేశారు.అనుమానితులని, నేరప్రవృత్తి ఉన్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు. మాచవరం ,గుణదల,పడమటలలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

విజయవాడలో నేరాల అదుపుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు, బ్లేడ్ బ్యాచ్ బాబులు, వ్యభిచార గృహాలు, రౌడీషీటర్ల ఆట కట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు మాచవరం, గుణదల ఏరియాల్లో తెల్లవారుజామున మెరుపుదాడులు చేసారు. అనుమానిత ప్రదేశాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించి.. డోర్ టు డోర్ సోదా చేశారు. వాహన తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఇటీవలి కాలంలో ఎంటరయ్యారా అన్న విషయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరి డేటాను సేకరించారు. నేరగాళ్ల గుండెల్లో దడపుట్టించారు. తప్పు చేస్తే తాట తీస్తామనే సంకేతాలు పంపిస్తున్నారు.

డీసీపీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేసామని డీసీపీ చెప్పారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 21 వాహనాలు స్వాధీనం చేసుకొని, ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇక్కడ 12 మంది రౌడీ షీటర్స్ ఉన్నారని, వారిని కూడా విచారించి నేరప్రవృత్తిని వదిలిపెట్టాలని హెచ్చరించామన్నారు.ఇక్కడి నుంచి జరిగే గంజాయి సరఫరాని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతామంటున్నారు.

మరిన్ని వార్తలు