పరారైన రిమాండ్ ఖైదీ కోసం పోలీసుల వేట

30 May, 2016 03:43 IST|Sakshi
పరారైన రిమాండ్ ఖైదీ కోసం పోలీసుల వేట

కళ్యాణదుర్గం :  కళ్యాణదుర్గం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు ఆలియాస్ గణపతి పరార్ కావడంతో అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ నెల 12న పలు చోరీ కేసుల్లో నాగరాజుతోపాటు మరొక దొంగను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నాగరాజు ఆలియాస్ గణపతి తనకు ఆరోగ్యం సరిగా లేదని సబ్ జైలు అధికారులతో విన్నవించుకోవడంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీస్టేషన్ కానిస్టేబుల్ భూపతి ద్వారా నాగరాజును శనివారం వైద్య పరిక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లిన అతడు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు బయటకు పొక్కుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కాగా పరారైన ఖైదీ కోసం పలు పోలీసుల బృందాలు వివిధ ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం, అనంతపురం, బెలుగుప్ప, ఉరవకొండ, రాయదుర్గం తదితర ప్రాంతాలలో పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై టౌన్ ఎస్‌ఐ శంకర్‌రెడ్డిని వివరణ కోరగా సబ్ జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

సబ్‌జైల్ సూపరిండెంట్ ధనుంజయ్య నాయుడును వివరణ కోరగా రిమాండ్ ఖైదీ నాగరాజు ఆలియాస్ గణపతిని పట్టణ పోలీసులు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరారైన విషయాన్ని సబ్‌జైలు ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.

మరిన్ని వార్తలు