అక్కినేనికి దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ

23 Jan, 2014 01:51 IST|Sakshi

 అక్కినేని మృతితో సినిమా పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఆయన తన సినిమాలతో ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచి ఉంటారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. అక్కినేని కుమారుడు నాగార్జునకు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’
 - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
 
నాగేశ్వరరావు మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు చిత్రసీమకు చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’
 - ప్రధాని మన్మోహన్‌సింగ్
 
 ఓ కళాకారుడిగా అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి అక్కినేని ఎంతో కృషి చేశారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’’
 -  రాష్ట్ర గవర్నర్ నరసింహన్
 
 సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారు. ఆయన మంచి మార్గదర్శకుడు, మంచి వ్యక్తి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’
 - రోశయ్య, తమిళనాడు గవర్నర్
 
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అక్కినేని ఎనలేని కృషి చేశారు. నాటక, సినీ రంగాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ 75 ఏళ్లు సినీపరిశ్రమలో కొనసాగారు. అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించి చిత్ర పరిశ్రమ ఇక్కడ స్థిరపడడానికి దోహదపడ్డారు.  ఆయన మరణంతో భారత చలన చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమా మహా నటుడిని కోల్పోయింది.’’
 - ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
 
 తెలుగుజాతి ఒక నట దిగ్గజాన్ని కోల్పోయింది. తెలుగు తెరకు ద్విపాత్రాభినయాన్ని పరిచయం చేసిన నటుడు అక్కినేని. అలాంటి గొప్ప నటుడి సరసన నేను తెలుగు చిత్ర పరిశ్రమకు (మనుషులు మమతలు చిత్రం ద్వారా) పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.’’
 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి
 
భారత సినీ పరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయనను మనం ఎప్పటికీ మరిచిపోలేం. అక్కినేని మృతి బాధాకరం’’
 - నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం
 
 సినీ రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు పెద్దలోటు. అక్కినేని మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’
 -కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ అధినేత
 
 అక్కినేని తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆయనతో నా బంధం సినిమాకే పరిమితం కాదు.. మాది కుటుంబ బంధంలాంటిది. నా దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో నాగేశ్వరరావుగారే. ఆయన కెరీర్‌లో నిలిచిపోయే సినిమా చేయాలనే పట్టుదలతో.. రెండు వందలవ సినిమా ‘మేఘ సందేశం’ చేశాం. మంగళవారం రాత్రి ఆయన చూసిన చివరి సినిమా ‘మేఘసందేశం’ అని కుటుంబ సభ్యులు చెబితే తెలిసింది.’’
 - దాసరి నారాయణరావు
 
 అక్కినేని ‘ఇల్లరికం’ వంద రోజుల వేడుక జరిగినప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్‌ని. ప్రజల్లో ఆయనకున్న క్రేజ్‌ని చూసి.. నటుడిని కావాలనే ఆలోచన కలిగింది. నాగేశ్వరరావుగారితో కలిసి నేను చాలా సినిమాలు చేశాను. నన్నెంతగానో ప్రోత్సహించేవారు. ఆయన మృతి బాధాకరం’’
 - కృష్ణ
 
 సినిమాపరంగానే కాదు.. వ్యక్తిగతంగా నాగేశ్వరరావుగారితో నాకు బంధుత్వం ఉంది. ఆయనతో నేను నిర్మించిన ‘ప్రేమ్‌నగర్’ నన్ను నిర్మాతగా నిలబెట్టింది. పదిహేను రోజుల క్రితమే ఆయన్ను కలిశాను. చాలా సరదాగా మాట్లాడారు. ఈ రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు’’
 - రామానాయుడు

అసెంబ్లీ, మండలి నివాళి
 సాక్షి, హైదరాబాద్: నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. బుధవారం శాసనసభలో భోజన విరామ సమయం తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతాప సందేశాన్ని చదివారు. అక్కినేని సినీ ప్రయాణం సాగిన తీరును, అందుకున్న పురస్కారాలను గుర్తు చేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఉదయం శాసనమండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ చక్రపాణి సంతాప సందేశాన్ని చదివారు. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని ధ్రువతారగా నిలుస్తారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. మాజీ సభ్యురాలు సంయుక్త బుల్లయ్య మృతికి కూడా మండలి సంతాపం ప్రకటించింది.

ఆ నమ్మకమే నడిపిస్తోంది
 ‘‘1972లో నాకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఓ 14 ఏళ్లు బతుకుతానన్నారు’’ - తన 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2013 సెప్టెంబర్ 28న జరిపిన సన్మానం సందర్భంగా అక్కినేని అన్న మాటలివి. రాగసప్తశ్వరం నిర్వాహకురాలు వీఎస్ రాజ్యలక్ష్మి, టీఎస్‌ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, నటులు కలిసి ఆయనకు రజత సింహాసనం బహూకరించారు. ఆ సందర్భంగా భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ‘‘నాకు భగవంతునిపై నమ్మకం లేదు. ప్రేక్షక దేవుళ్లపైనే నమ్మకం. భగవంతుని కంటే నమ్మకమే ముఖ్యం. ఇంకా నేను బతికున్నానంటే నన్ను నడిపిస్తున్నది నమ్మకమే. 89, 90... ఇలా వయసు పెరుగుతోందంటే ప్రేక్షకుల ఆశీర్వాదమే. వైద్యుల సలహాల వల్లే ఇలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అన్నారు. తనకు ఆరోగ్య సలహాలిచ్చే డాక్టర్ పీఎస్ రావుకు పాదాభివందనం చేశారు.

మరిన్ని వార్తలు