‘మావోయిస్టుల ప్రకటన’పై ఉత్కంఠ

1 Oct, 2018 08:22 IST|Sakshi
నిఘా నీడలో వారపు సంతలు

వారమైనా హత్యలకు దారి తీసిన పరిస్థితులను వెల్ల్లడించని మావోయిస్టులు

ఎదురు చూస్తున్న పోలీసు యంత్రాంగం, రాజకీయ నాయకులు

విశాఖపట్నం, అరకులోయ:  డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల లివిటిపుట్టలో  అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను   హత్య చేసిన  ఘటనపై  ఇంత వరకు మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయకపోవడం మన్యంలో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టులు ఏదైన సంఘటనకు పాల్పడితే ఆ స్థలంలో విడిచిపేట్టే  లేఖల  ద్వారా గాని, పత్రిక ప్రకటనల ద్వారా గాని తాము ఆ సంఘటనకు ఎందుకు పాల్పడ్డాయో తెలియజేస్తారు.  ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను హత్య చేసి వారం రోజులు కావస్తున్నా ఇంత వరకు... ఈ నేతలను ఎందుకు హత్యచేయవలసి వచ్చిందో మావోయిస్టులు ప్రకటించలేదు.

మావోయిస్టుల ప్రకటన కోసం హత్యకు గురైన నేతల కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు,మన్యం  ప్రజలు,మరో వైపు పోలీసు యంత్రాంగం ఎదురుచూస్తోంది. మావో యిస్టులు ప్రకటనపై మన్యంలో ఉత్కంఠ నెలకొంది.వారు ప్రకటన చేయడంలో జాప్యానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టు క్యాడర్‌ బలంగానే ఉంది.  మావోయిస్టు పార్టీకి చెందిన  కీలక నేతల పేరుపై ఏదో ఒక చోట పత్రికలకు ప్రకటన వస్తుంది. దీని కోసం మీడియా కూడా   ఎదురుచూస్తోంది. సంఘటన జరిగిన వారం రోజుల కావస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనంగానే ఉంది. మరో వైపు పోలీసు యంత్రాంగం సిట్‌ బృందంతో నేతల హత్యలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోంది. వారిద్దరినీ మావోయిస్టులు హత్యచేయడానికి గల కారణాలను పోలీసు యంత్రాంగం కూడా నిర్ధారించలేక పోతోందని సమాచారం. ఈ హత్యలపై మరిన్ని  వివరాల సేకరణకు మావోయిస్టుల ప్రకటన కూడా కీలకంగా ఉంటుందని పోలీసు యంత్రాంగం భావిస్తోంది.

ఈ హత్యలకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో అనేక అనుమానాలు  ఉన్నాయి. రాజకీయ కోణంలో హత్యలు జరిగి ఉంటాయని,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,డీజీపీ ఠాకూర్‌లకు తెలిపారు.ఈ కోణంలోనూ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కారణాలు బయటపడాలంటే మావోయిస్టులు విడుదల చేసే లేఖ కూడా చాలా ముఖ్యం.

నిఘా నీడలో వారపు సంతలు
సీలేరు(పాడేరు):  లివిటిపుట్టులో గత ఆదివారం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో  వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. మావోయిస్టులు కటాఫ్‌ ఏరియాలోకి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ  వారు విశాఖ మన్యంలో ఉన్నారని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌  ప్రకటించారు. దీంతో ఏజెన్సీలో11 మండలాల్లో అన్ని వారపు సంతల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ సంతలు పోలీసు ల నిఘా నీడలో  జరిగాయి. అనుమానితులను తనిఖీ చేశారు.    ఐదు రోజులుగా  ఒడిశాసరిహద్దులో మావోయిస్టుల  ప్రభావిత ప్రాంతాలైన గుమ్మిరేవులు, ధారకొండ, సీలేరు, కొనములూరు, పాతకోట, చిత్రకొండ, బలిమెల, ఎంవి 79 వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా రోజూ ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. కాగా బలిమెల రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గించాలని, గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాలని లాంచీలకు మావోయిస్టులు  కరపత్రాలు అతికించారు.దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

టీడీపీ నేతలను విచారించిన సిట్‌ బృందం
అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమలను ఇటీవల మావోయిస్టులు హత్యచేసిన ఘటనపై  సిట్‌ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ బృందం ఆదివారం డుంబ్రిగుడ,అరకులోయ మండలంలోని కొంతమంది టీడీపీ నేతలను విచారించింది. హత్య జరిగిన రోజు  అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కండ్రూం పంచాయతీ సరాయి గ్రామానికి బయలుదేరిన టీడీపీ నేతలతో పాటు,ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేతల వివరాలను సేకరించిన సిట్‌ బృందం వారందరినీ విచారించినట్టు తెలుస్తోంది.

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
చింతపల్లి(పాడేరు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టుల హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను మానవ మృగాలతోపోల్చుతూ ఖబడ్దార్, గిరిజన ద్రోహులు మావోయిస్టులంటూ పోస్టర్లలోపేర్కొన్నారు.

మరిన్ని వార్తలు