అధికారం అందరిదీ...

18 Mar, 2019 12:59 IST|Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని కొత్త అర్థాన్నిచ్చిన వైఎస్‌ జగన్‌ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే దిశగా అడుగులు వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సీట్ల కేటాయింపులో బీద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ సీట్లలో 41 సీట్లు బీసీలకు కట్టబెట్టి తాను వారి పక్షపాతినని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీ, మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు సీట్లను బీసీలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం, రేపల్లె నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, చిలకలూరిపేట నుంచి రజక సామాజికవర్గానికి చెందిన విడదల రజని బరిలో నిలుస్తున్నారు.

మహిళలకు సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇచ్చింది. మహిళలకు మూడు సీట్లు కేటాయించగా, ఆ మూడు ఎస్సీ, బీసీ మహిళలకు ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ముగ్గురు మహిళలకు సిట్లు ఇచ్చింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వైఎస్‌ జగన్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనమని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. 

ఒక్క సీటూ కేటాయించని టీడీపీ..
‘ఆడది ఇంట్లో ఉండాలి.. కారు షెడ్లో ఉండాలి’.. అంటూ శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ సీఎం చంద్రబాబు మహిళను కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్ల కేటాయింపులో కూడా టీడీపీ మహిళలపై వివక్ష చూపింది. జిల్లాలో ఇటీవల 14 సీట్లు కేటాయించిన సీఎం ఒక్క సీటు కూడా మహిళలకు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో సైతం వారికి మొండిచేయి చూపారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. 

బీసీ సీటును లాక్కున్న లోకేష్‌..
‘మాదీ బీసీల పార్టీ’అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సీట్ల కేటాయింపులో బీసీల తీరని ద్రోహం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ 14 సీట్లు కేటాయించగా ఒక్క సీటు మాత్రమే చంద్రబాబు బీసీకి కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గంలో గత ఏడాది బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఈ సారి ఆ సీటును చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌కు కేటాయించి ద్రోహం చేయడంతో బీసీలు మండిపడుతున్నారు. 

మమ్మల్ని గుర్తించిన నేత జగన్‌
బీసీ కులాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వడ్డెర సామాజికవర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌. మా సామాజికవర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించి రాజకీయ గుర్తింపునిచ్చారు. వడ్డెర మహిళను గుంటూరు జిల్లా పరిషత్‌ వైస్‌  చైర్మన్‌గా ఎంపిక చేశారు.  
– వేముల శివ, వడ్డెర సంక్షేమసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి 

మహిళలంటే అంత అలుసా..
మహిళలంటే టీడీపీ ప్రభుత్వానికి అంత అలుసా.  ఒక్క సీటూ కేటాయించలేదు. వివక్ష చూపుతూ మాది సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎలా ప్రచారం చేసుకుంటారు. బీసీలు, మహిళలలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. టీడీపీకి బుద్ధి చెబుతాం. 
– బత్తుల మృదుల, మహిళ, బ్రాహ్మణపల్లి 

మరిన్ని వార్తలు