జనం మదిలో నిలిచేలా భారీ బహిరంగ సభ

5 Sep, 2018 07:12 IST|Sakshi
మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ నగర కార్యాలయంలో 72 వార్డుల పరిధిలో బూత్‌ కన్వీనర్లతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

9న నగరంలో నిర్వహణకు సన్నాహాలు

వేదిక : కంచరపాలెం మెట్టు

ప్రజాసంకల్పయాత్రకు అపూర్వ స్వాగతం పలకాలి

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, తలశిల రఘురాం పిలుపు

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభ రాష్ట్ర ప్రజల మదిలో నిలిచిపోయేలా విశాఖ నగరంలో పకడ్బందీగా నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి, ప్రజాసంకల్పయాత్ర ప్రొగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల  రఘురాం నగర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు పశ్చిమ నియోజకవర్గం 66వ వార్డు కొత్తపాలెం వద్ద నగరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ఆ మరుసటి రోజు 9న మధ్యాహ్నం 3 గంటలకు కంచరపాలెం మెట్టు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేయాలన్నారు. పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ అధ్యక్షతన మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నగర శ్రేణులు, 72 వార్డుల పరిధిలోని బూత్‌ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ, ప్రజాసంకల్ప యాత్ర ఏర్పాట్లపై చర్చించారు.

పార్టీ విజయకేతనానికి విశాఖ సభ సంకేతం కావాలి : విజయసాయిరెడ్డి
భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయకేతనానికి బహిరంగ సభ సంకేతంగా నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారన్నారు. జనం హృదయాలను కొల్లగొడుతూ వేలాది మైళ్ల దూరం కాళ్ల బొబ్బులతో ఎండనక, వాననక పాదయాత్ర సాగిస్తున్న జననేత జగన్‌కు 10 జిల్లాలో జనం బ్రహ్మరథం పట్టారన్నారు. ఉప్పొంగిన జనసంద్రంతో కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్‌ ఊగిపోగా.. గోదావరి బ్రిడ్జి దద్దరిల్లిందని చెప్పారు. వీటికి దీటుగా విశాఖ బహిరంగ సభ నిర్వహించి చరిత్ర సృష్టించాలని ఆయన సూచించారు. సుమారు లక్షా 25 వేల మంది బహిరంగ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంకల్పయాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో విశాఖ నగర పరిధిలోని 7 నియోజకవర్గాలను కలుపుకొని నిర్వహిస్తున్న బహిరంగ సభ జనసంద్రంతో నిండిపోవాలన్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని, 2019 ఎన్నికల్లో అధికార టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 2003లో మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానంతో సాగించిన పాదయాత్రతో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నారన్నారు. తిరిగి అదే రీతిలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రతో 2019లో 15 అసెంబ్లీ స్థానాలలో విజయఢంకా మోగించాలన్నారు. 2014లో నగరంలో ఎదురైన చేదు అనుభవానికి కారణం దుష్ప్రచారమేనన్నారు.

10, 12 తేదీల్లో బ్రాహ్మణ, ముస్లింలతో జగన్‌ ఆత్మీయ కలయిక
ఈ నెల 10న బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం, 11న పార్టీ అంతర్గత సమావేశం, 12న ముస్లిం సోదరులతో జరిగే ఆత్మీయ కలయికలో జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని ఎంపీ తెలిపారు.
విశాఖ బహిరంగ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలి : తలశిల రఘురాం

నగరంలో నిర్వహించే బహిరంగ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ శ్రేణులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని ప్రజా సంకల్పయాత్ర ప్రొగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. అధికార పార్టీకి విశాఖ బహిరంగ సభతో కంటి మీద కునుకు లేకుండా చేయాలన్నారు. చిరస్థాయిగా నిలిచిపోయాలా క్షేత్ర స్థాయిలో బూత్‌ కన్వీనర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన సూచించారు.

నవ్యాంధ్రకు చంద్ర గ్రహణం :  ఆనం రాంనారాయణరెడ్డి
నగరం నడిబొడ్డున జరిగే ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభతో నలభై ఏళ్ల పాటు విశాఖ పురోగతికి బాట కావాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తరహా పాలన కోసం ప్రజాసంకల్పయాత్రతో దూసుకుపోతున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు పరితపిస్తున్నారన్నారు. నవ్యాంధ్రకు నాలుగేళ్ల పాటు చంద్ర గ్రహణం పట్టుకుందని, బహిరంగ సభతో దాన్ని విడిచి పెట్టేందుకు చక్కని పరిహారం కావాలన్నారు. అనుమతులు అనే అడ్డంకులకు ప్రజాసంకల్పయాత్రను ఆదరిస్తున్న జనహృదయాలే తగిన బుద్ధి చెబుతాయన్నారు.

ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కె.కె.రాజు, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి›, మైనార్టీ సెల్‌ ప్రతినిధి ఐ.హెచ్‌.ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర కార్యదర్శులు ఉరుకూటి అప్పారావు, సనపల చంద్రమౌళి, అదనపు కార్యదర్శులు జి.వి.రవిరెడ్డి, పక్కి దివాకర్, చొక్కాకుల వెంకటరావు, బర్కత్‌ఆలీ, ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు నడింపల్లి కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, జియ్యాని శ్రీధర్, సేనాపతి అప్పారావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కొండా రాజీవ్‌గాంధీ, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, బద్రినాథ్, సబీరాబేగం, కె.ఆర్‌.పాత్రుడు, వాసుగౌడ్, శ్యామ్‌కుమార్‌రెడ్డి, యువశ్రీ, శ్రీదేవివర్మ, మళ్ల ధనలత, వారధి శ్రీదేవి, విద్యార్థి నాయకులు సురేష్, కాంతారావు, ఆజమ్‌ ఆలీ  పాల్గొన్నారు.  

పంచెకట్టుపై 2014లోవిషప్రచారం : ఆనం
2014లో పంచెకట్టు పై విశాఖలో టీడీపీ, బీజేపీలు విష ప్రచా రం చేశాయని ఆనం రాంనారాయరెడ్డి పేర్కొన్నారు. ‘మాకు ఉన్న వస్త్రధారణ మా సంప్రదాయం.. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి దోవతి పంచె కడతారు.. నేను అడ్డుకట్ట కడతాను’అని ఆయన వివరించారు. వస్త్రధారణ ముఖ్యం కాదు.. మనసు, హృదయం, మంచి చేస్తున్న దానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు