శభాష్‌ సిద్ధార్థ్‌ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

28 Aug, 2019 07:55 IST|Sakshi
ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

స్పందనకు వచ్చే భూ వివాదాలు తీర్చేందుకు చర్యలు

ఫిర్యాదు ఇచ్చిన ఐదు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశం

ఒంగోలు ఎస్పీ సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సీఎం శ్రీకారం 

ఈ వారం పోలీస్‌ స్పందనకు 20 భూ వివాదాల ఫిర్యాదులు

గ్రామాల్లో భూ వివాదాలతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడం చూస్తున్నాం. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు నిజమైన భూ యజమానులు పోలీస్‌ స్టేషన్లు, రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో సగానికి పైగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ముఖ్యంగా పోలీస్‌ గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదుల్లో ఇవే అధికంగా ఉంటున్నాయి. సివిల్‌ వివాదం కావడంతో ఇప్పటి వరకు పోలీసులు

ఇందులో తామేమీ చేయలేమని చెబుతూ వస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ భూ వివాదాలపై దృష్టి సారించడంతో పాటు వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయంతో కూడి చేయాల్సిన పని కావడంతో స్పందనపై సీఎం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో తమ ప్రణాళికను సీఎంకు వివరించారు. ఎస్పీ సూచన సరైనదేనని భావించిన సీఎం వైఎస్‌ జగన్‌ దానిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆచరణలో పెట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెల్‌డన్‌ సిద్ధార్థ్‌ అంటూ ఎస్పీని అభినందించారు. 

సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆలోచన వల్ల ఇందులో మరో అడుగు ముందుకు పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం స్పందనలో ఫిర్యాదులు అందిన వెంటనే వాటిలో నుంచి భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను వేరు చేసి మంగళవారం కలెక్టర్‌ కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల తహశీల్దార్‌ కార్యాలయాలకు బుధవారం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మండల కేంద్రంలో తహశీల్దార్, స్థానిక పోలీస్‌ అధికారి, సర్వేయర్, పంచాయతీ అధికారి ఇలా సంబంధిత అధికారులంతా సమావేశమై ఉన్నతాధికారుల నుంచి అందిన భూవివాదాల ఫిర్యాదులను పరిశీలిస్తారు.

అధికారులంతా కలిసి శుక్రవారం ఫిర్యాదుదారుడిని పొలం లేదా స్థలం వద్దకు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లి వివాదం ఉన్న వ్యక్తితో పాటు గ్రామ పెద్దలను పిలిపించి దానిపై చర్చిస్తారు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరించి, పెద్ద మనుషుల సమక్షంలో లిఖిత పూర్వక ఒప్పంద పత్రాలు రాయిస్తారు. ఇందులో ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తేలితే పోలీసులు క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. తహశీల్దార్‌ దీనిపై నోటీసులు జారీ చేస్తారు. నిజమైన భూ యజమానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. ఒక వేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే తాత్కాలిక చర్యలు చేపట్టి కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు చేపడతారు. ఇలా ఐదు రోజుల్లో స్పందనకు వచ్చిన భూ వివాదాల ఫిర్యాదులను పరిష్కరించే దిశగా తొలి అడుగు పడింది. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన 20 భూ వివాదాల ఫిర్యాదులను కలెక్టర్‌ కార్యాలయానికి పంపారు. కలెక్టర్‌ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు వీటిపై మంగళవారం చర్చించారు. బుధవారం నుంచి పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

భూ వివాదాల పరిష్కారం ఇక సులభతరం..
గ్రామాల్లో రైతులు, గ్రామస్థుల మధ్య భూ వివాదాలే ఎక్కువుగా జరుగుతుంటాయి. సివిల్‌ వివాదాలంటూ పోలీసులు పట్టించుకోక పోవడం... రికార్డుల ఆధారంగా చర్యలంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండడం, సర్వే నిర్వహించేందుకు సర్వేయర్లు నిరాకరిస్తుండడంతో ఈ వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుండగా మరి కొందరు మాత్రం నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు. స్పందనలో వచ్చే భూ వివాదాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడంతో ఇక భూ వివాదాలకు చెక్‌పెట్టడం సులభతరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు తగ్గి శాంతి భద్రతలకు సైతం విఘాతం కలగకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదులు అంటే కింది స్థాయి అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలు నేరుగా రంగంలోకి దిగి వీటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడంపై అభినందనీయం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా