ఎన్నికల పోరుకు సిద్ధం

19 Mar, 2019 07:55 IST|Sakshi

బీసీలే టీడీపీకి అండ అనే నినాదంతో ఇన్నాళ్లూ బలహీనవర్గాల గడ్డ సిక్కోలులో పాగా వేయగలిగారు.. కానీ ఆచరణలో బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని తేలిపోయింది! ఇలాంటి నేపథ్యంలో బీసీలకు నేనున్నాను అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభయమిచ్చారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి సహా జిల్లాలో రాజాం (ఎస్సీ), పాలకొండ (ఎస్టీ) మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చి తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పారు. మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంతో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. జగన్‌కో అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజల అండతో టీడీపీ కోట బద్దలుకొట్టడానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సై అంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

మరోసారి ధర్మాన వర్సెస్‌ గుండ
శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుండ కుటుంబంతో మరోసారి తలపడనున్నారు. 2004, 2009 ఎన్నికలలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణను ఓడించారు. 2014 ఎన్నికలలో మాత్రం చంద్రబాబు అప్పలసూర్యనారాయణను కాదని ఆయన భార్య లక్ష్మీదేవిని పోటీకి దింపారు. ఈ ఎన్నికలలో ధర్మాన ఓటమి పాలయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే కాదు జిల్లా మొత్తంమీద ఎక్కడా అభివృద్ధి కానరాలేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ధర్మాన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి ఏదైనా ధర్మాననే గెలుపించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్‌ మరోసారి ఆయననే బరిలోకి దించారు. టీడీపీ కూడా లక్ష్మీదేవికే ఈసారీ అవకాశం ఇచ్చింది. 
 

పాత ప్రత్యర్థుల మధ్యే ఆమదాలవలస పోరు
ఆమదాలవలసలో 1983, 1985, 1991 (ఉప ఎన్నిక), 1994, 1999 ఎన్నికలలో మొత్తం ఐదుసార్లు గెలిచి ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సభ్యుడిగా వ్యవహరించిన తమ్మినేని సీతారాంకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. గత మూడు దఫాల్లో ఆయనకు విజయం దక్కకపోయినా ఈసారి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్, మున్నా సహా పలువురు నాయకులను పార్టీలోకి చేర్పిస్తూ ఆమదాలవలసలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేశారు. తిత్లీ తుఫానులో అనేకమంది బాధితులకు విశేషంగా సహాయం చేసిన యువ శాస్త్రవేత్త గేదెల శ్రీనుబాబు కూడా గత వారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో బూర్జ మండలానికి చెందినవారే కావడం విశేషం. మరోవైపు సిటింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌నే టీడీపీ మరోసారి బరిలోకి దించింది. నాగావళి, వంశధార నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో చెరబట్టిన మాఫియాకు కూన అండదండలు అందించడంపై ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అక్రమ సంపాదన వెదజల్లినా ప్రజలు మాత్రం ఫ్యాన్‌కే చాన్స్‌ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. 


నరసన్నపేటలోనూ పాత ప్రత్యర్థులే..
ధర్మాన కుటుంబానికి తొలి నుంచి బాసటగా నిలుస్తున్న నరసన్నపేట నియోజకవర్గంలో కృష్ణదాస్‌ 2009, 2012 (ఉప ఎన్నిక) ఎన్నికలలో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉన్నారు. గత ఎన్నికలలో కృష్ణదాస్‌పై గెలిచిన బగ్గు రమణమూర్తికే టీడీపీ ఈసారి కూడా టికెట్‌ ఇచ్చింది. పాత ప్రత్యర్థినే మరోసారి ఎదుర్కొనేందుకు కృష్ణదాస్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. 


టెక్కలిలో త్రిమూర్తుల విశ్వరూపం
టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏదిఏమైనా అచ్చెన్నపై విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ యువకుడైన పేరాడ తిలక్‌కు టికెట్‌ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్‌ సొంత ప్రాంతం కూడా టెక్కలే. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ ప్రాంతవాసే. త్రిమూర్తుల్లాంటి ముగ్గురు నాయకులు సమష్టి కృషితో టీడీపీని మట్టి కరిపించడానికి కృషి చేస్తున్నారు. 


పలాసలో కొత్తవారి మధ్య పోటీ
పలాసలో వైఎస్సార్‌సీపీ తరఫున యువ వైద్యుడు సీదిరి అప్పలరాజు పోటీచేస్తుండగా, ఆయనకు పోటీగా గౌతు శివాజీకి బదులు ఆయన కుమార్తె శిరీషకు టీడీపీ టికెట్‌ ఇచ్చింది. పలాస బరిలో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టినవారే. 


సిట్టింగ్‌ల వైపే వైఎస్సార్‌సీపీ మొగ్గు
పాలకొండలో వైఎస్సార్‌సీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినే జగన్‌ మరోసారి బరిలోకి దించారు. గత ఎన్నికలలో ఆమె చేతిలో ఓడిపోయిన నిమ్మక జయకృష్ణనే టీడీపీ ఈసారి కూడా నమ్ముకుంది. రాజాంలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులు మరోసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కావలి ప్రతిభాభారతిని కాదని, అదే ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కనీసం డిపాజిట్‌ కూడా దక్కని కొండ్రు మురళీమోహన్‌ను ఇటీవల టీడీపీ పార్టీలోకి చేర్చుకుని టికెట్‌ ఇచ్చింది. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొండ్రు దూకుడు కూడా జిల్లా ప్రజలకు తెలిసిందే. అలాంటి కొండ్రు కన్నా సౌమ్యుడైన జోగులుకే రాజాం ప్రజలు పట్టం కడతారనే విశ్లేషణలు ఉన్నాయి. 


ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు పోటీగా టీడీపీ తరఫున బెందాళం అశోక్‌ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన యాదవ సంఘ నాయకుడు నర్తు నరేంద్ర యాదవ్‌ అక్కడి పరిస్థితుల్లో ఇమడలేక మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. మరో మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల (లల్లూ) కూడా చేరడంతో ఇప్పుడు ఇచ్ఛాపురంలో వైఎస్సార్‌సీపీ బలీయంగా కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్లలో కిమిడి కళావెంకటరావుకే టీడీపీ మరోసారి టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికలలో స్వల్ప తేడా ఆయన చేతిలో ఓటమి చూసిన గొర్లె కిరణ్‌కుమార్‌ ఈసారి కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అవినీతి టీడీపీ నాయకులను ప్రజలు తిప్పికొట్టి ఈసారి ఫ్యాన్‌కే ప్రజలు పట్టం కడతారని కిరణ్‌కుమార్‌ బలంగా చెబుతున్నారు.

గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచి టీడీపీ ప్రలోభాలతో ఫిరాయించిన కలమట వెంకటరమణ మరోసారి పాతపట్నంలో పోటీపడటానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. తాను నమ్మి వెళ్లిన టీడీపీ అధిష్టానమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు తటాపటాయించాల్సి వచ్చింది. చివరి నిమిషంలో సీటు తెచ్చుకున్నా వైఎస్సార్‌సీపీ తరఫున రెడ్డి శాంతి రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. శాంతి ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. ఆమె కృషికి తగినట్లుగానే వైఎస్సార్‌సీపీలోకి చేరికలు కూడా భారీగా సాగుతున్నాయి.   

మరిన్ని వార్తలు