పరవశించిన కోవిందుడు

3 Sep, 2017 02:26 IST|Sakshi

- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌
- రాష్ట్రపతి వెంట గవర్నర్, సీఎం


సాక్షి, తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, కుమారుడు ప్రశాంత్‌కుమార్, కుమార్తె స్వాతి, ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఉదయం 7.08 గంటలకు క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఉదయం 7.32 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు, అర్చకులతో కలసి రాష్ట్రపతికి ఇస్తికఫాల్‌ మర్యాదలతో స్వాగతం పలికారు.

పచ్చ కర్పూరపు వెలుగులో శ్రీవారి దివ్య మంగళరూపాన్ని దర్శించకుని రాష్ట్రపతి ఆనంద పరవశులయ్యారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన పట్టు శేషవస్త్రాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రాష్ట్రపతికి బహూకరించారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ ఈవో సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు రాష్ట్రపతికి అందజేశారు. గవర్నర్‌ నరసింహన్, సీఎం చంద్రబాబు కూడా ఆయనతో కలసి శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.



టీటీడీ ఆతిథ్యంపై కోవింద్‌ మహదానందం
శ్రీవారి దర్శనం తర్వాత కుటుంబ సభ్యులతో కలసి ఉదయం 8.30 గంటలకు  అతిథి గృహానికి చేరుకుని రాష్ట్రపతి అల్పాహారం స్వీకరించారు. అన్నప్రసాద విభాగం ప్రత్యేక శ్రద్ధతో షడ్రషోపేత రుచులతో వడ్డించటంపై రాష్ట్రపతి కుటుంబం మహదానందం చెందింది. అతిథి మర్యాదలు చాలా బాగున్నాయని రాష్ట్రపతి కోవింద్‌ స్వయంగా టీటీడీ ఈవో, జేఈవోలను  అభినందించారు.

>
మరిన్ని వార్తలు