పట్టని వివాహ చట్టం

5 May, 2019 09:15 IST|Sakshi

గ్రామ పంచాయతీల్లో వివాహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అటకెక్కింది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాకే వివాహం చేయాలనే నిబంధన ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. చట్టంతో పాటు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా స్పందించడం లేదు. దీంతో ఇప్పటికీ గ్రామాల్లో బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

తనకల్లు: బాల్య వివాహాలను నిర్మూలించాలనే లక్ష్యంతో 2012వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. అన్ని మతాల వారికి చట్టం వర్తించేలా రూపొందించారు. అయితే నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో ఏ పంచాయితీలోనూ వివా హాల రిజిస్ట్రేషన్‌ అమలు కావడం లేదు.

పట్టించుకోని అధికారులు
వివాహాలు చేసుకొనే ముందు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు గురించి సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో 30 నుంచి 40 శాతం వరకు బాల్య వివాహాలే జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి గిరిజన తండాలు, పల్లెల్లో తల్లిదండ్రుల అవగాహన లోపం, ఆర్థిక సమస్యల కారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

బాల్యవివాహాలకు ఏదీ అడ్డుకట్ట?
బాల్య వివాహాలు చేయరాదని, ఆడ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహాలు చేయాలంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. వివాహ నమోదు చట్టం, బాల్య వివాహాల గురించి స్త్రీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి తల్లిదండ్రులకు, విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అయితే ఈ సదస్సులు ఇప్పటి వరకు మండలంలోని ఏ పంచాయతీ లోనూ నిర్వహించిన దాఖలాలు లేవు.

అవగాహన కల్పిస్తాం
వివాహాల నమోదు కా ర్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేసేందుకు చర్యలు తీ సుకుంటాం. బాల్య వి వాహాల వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. కార్యదర్శులతో కలిసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తాం. – ఆదినారాయణ, ఈఓఆర్డీ, తనకల్లు

అవగాహన కల్పించాలి
వివాహాల నమోదు గురించి చాలా మందికి తెలియదు. ఈ ప్రక్రియ గురించి అధికారులు గ్రామాల్లో తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవగాహన లేక కొందరు ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోతున్నారు. – చిదానందరెడ్డి, గణాధివారిపల్లి

అనర్థాలను గ్రామీణులకు వివరించాలి
గిరిజనుల నిరక్షరాస్యతకు తోడు, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దీంతో తండాలలో అత్యధికంగా జరిగేవి బాల్య వివాహాలే. అయినా అధికారులు బాల్య వివాహాం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం లేదు. అధికారులు తండాలలో వివాహ రిజిస్ట్రేషన్‌పై చైతన్యం తీసుకురావాలి. – రవీంద్రానాయక్, గిరిజన సంఘం నాయకుడు, జీఎన్‌ తండా 

మరిన్ని వార్తలు