బూచోళ్లున్నారు

3 Nov, 2015 02:19 IST|Sakshi

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి
ఆసుపత్రిలో రక్షణ కరువు
బిడ్డలను ఎత్తుకెళ్లే ముఠా
తిష్టవేసినట్లు అనుమానాలు
ఈ ఏడాదిలో  రెండు మిస్సింగ్ కేసులు

 
 తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డలకు రక్షణ కరువైంది. కొంతకాలంగా బిడ్డలను ఎత్తుకెళ్లే ముఠా అక్కడే తిష్టవేసినట్లు అనుమానాలున్నాయి. ఈ ఏడాదే రెండు మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ సంఘటనల
 కారణంగా తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.   
 
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గ్రామీణులు, అమాయకులే లక్ష్యంగా పురిటి బిడ్డలను మాయం చేస్తుండంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యాధికారులు, పోలీసు యంత్రాంగం తమకేమి పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా పురిటి బిడ్డల భద్రతకు శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
 
మొన్న సోనియాకు కడుపు శోకం...
 ఈ ఏడాది జనవరిలో చంద్రగిరి నియోజకవర్గం, మొరవపల్లికి చెందిన సోనియా మొదటి కాన్పుకు ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో వ్యాక్సిన్ వేయాలంటూ నర్సు డ్రస్సులో వచ్చిన ఓ మహిళ  బిడ్డను తనతో పాటు తీసుకెళ్లిపోయింది. నాలుగు రోజుల తరువాత నాటకీయంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలి వెళ్లిపోయింది.
 
తాజాగా తుపాకుల సుధకు శోకం...
 ఏర్పేడు మండలం రావుల వారి కండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సుధా మొదటి కాన్పు కోసం భర్త వెంకటయ్యతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. ఈనెల 1వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అడ్మిట్ సమయంలో ఎవరైనా ఆడవాళ్లు తోడుగా ఉండాలని వైద్యసిబ్బంది చె ప్పారు. దీంతో ఆమె ఎదురుచూస్తుండగా ఓ మహిళ తనకు తాను లక్ష్మిగా పరిచయం చేసుకుని కాన్పు అయ్యేంత వరకు తోడుగా ఉంటానని నమ్మబలికింది. వైద్యసిబ్బందికి అక్కగా పరిచయం చేయాలని సూచించింది. శనివారం ఉదయం నుంచి తోడుగా ఉంది. ఆదివారం వేకువ జామున సుధ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఉమ్మనీరు తాగిందని, నవజాత శిశువు విభాగానికి తీసుకెళ్లాలన్న వైద్యసిబ్బంది సూచన మేరకు బిడ్డతో వెళ్లిన ఆమె అరగంట పాటు వైద్యం చేయించి అక్కడి నుంచి అటే ఉడాయిం చినట్లు తెలుస్తోంది.
 
పనిచేయని సీసీ కెమెరాలు..
 ఈ ఏడాది జనవరిలో సోనియా బిడ్డను మాయం చేసిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రిలో 24కుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణపై కొంతకాలం శ్రద్ధ పెట్టిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో అవి మూలనపడ్డాయి. విషయం ఆసుపత్రి ఉన్నతాధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే బిడ్డలను మాయం చేసే ముఠాకు మాత్రం ముందుగానే తెలిసింది. అందుకే దర్జాగా బిడ్డను ఎత్తుకెళ్లిపోయేందుకు ధైర్యం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సహకరించారా? లేదంటే కనీసం భద్రతా సిబ్బంది కూడా ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు ఆసుపత్రి నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ మహిళను గుర్తించి ఆమె ఏ మార్గంలోంచి వెళ్లిందన్న కోణంలో విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ముఠాను పట్టుకుంటామని అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు