బస్సు చార్జీల పెంపుపై నిరసన వెల్లువ

6 Nov, 2013 05:56 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్: బస్సుచార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని ఇలాంటి పరిస్థితులలోబస్సుచార్జీలు పెంచి ప్రభుత్వం సామాన్యునిపై మరింత భారాన్ని మోపిందని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు మండిపడుతున్నాయి.  బస్సుచార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం  ఖమ్మం, పాలేరు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, సీపీఐ, సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.
 
 ప్రధాన కూడళ్లవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.   బస్సుచార్జీల పెంపును నిరసిస్తూ....  సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం మయూరిసెంటర్, బైపాస్‌రోడ్డులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం సబ్ డివిజన్ కార్యదర్శి రామయ్య, నగర కార్యదర్శి శ్రీనివాల్, సీసీఐ నాయకులు మహ్మద్ సలాం, సాంబశివారెడ్డి, చింతా సూరిబాబు, మేకల శ్రీనివాస్, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, శ్రీనివాస్, విక్ర మ్, కోదాడ గిరి, విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు.
 
   భద్రాచలం ఆర్‌టీసి బస్టాండ్ ఎదుట సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ధర్నా చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా సీపీఎం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బస్సు ఛార్జీలను పెంచటాన్ని టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ సమావేశంలో ఖండించింది.
 
  ఇల్లెందులోని  జగదాంబ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ బస్సు చార్జీలు పెంచమని ఆధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పలుమార్లు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. సామాన్యులపై భారం మోపే చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ, పిట్టల రవి, గోపాల్, భారతీ, రమణ, కిరణ్,నర్సింహ్మరావు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
 
  సత్తుపల్లిలో  న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సబ్‌డివిజన్ కార్యదర్శి ఎ.రాము మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుల బతుకు దుర్భరంగా మారితే మరోవైపు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచటం దారుణమన్నారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 
  వైరా నియోజకవర్గ కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి దొంతు రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్  సెంటర్‌లో బస్సురోకో నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి వెంకటాద్రి, సుంకర సుధాకర్, బోడేపూడి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
 
  పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు  రాస్తారోకో నిర్వహించారు. పెంచిన చార్జీలు తగ్గించాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్  పాలేరు డివిజన్  కార్యదర్శి మర్రి మన్మధరావు మాట్లాడుతూ.. బస్సుచార్జీల పెంపుతో బస్‌పాసులు కూడా పెరగటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయని, వెంటనే  చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించకపోతే ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు. విద్యార్థులను ప్రభుత్వం విస్మరిస్తోందని, వారి సమస్యలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు