చంద్రగిరికి చిత్తూరు రౌడీయిజం..!

18 Dec, 2018 11:31 IST|Sakshi
దాడిలో గాయపడిన నిఖిల్‌

వరుస దాడులతో రెచ్చిపోతున్న నాని అనుచరులు

దామినేడులో కర్రలు, రాడ్‌లతో దాడి

తీవ్రరక్తగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

ఫ్లెక్సీలను కట్టడమే చేసిన నేరమా?

చిత్తూరు, తిరుపతి రూరల్‌: చిత్తూరు రౌడీ రాజకీయం చంద్రగిరికి విస్తరిస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో కత్తులు, రాడ్డులు సైరవిహారం చేస్తున్నాయి. వరుస దాడులతో పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మొన్న చంద్రగిరి మండలం మొరవపల్లిలో దళితుడైన పుట్టా రవిపై జరిగిన దాడిని మరవకముందే, నిన్న తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం పంచాయతీలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ను చితకబాదిన ఘటన కళ్లేదుటే ఉండగానే, తాజాగా తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిఖిల్‌పైన పులివర్తి నాని అనుచరులు కత్తులు, రాడ్‌లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రయత్నించడమే అతను చేసిన తప్పు.

కత్తులు, రాడ్లలతో దాడి
దామినేడుకు చెందిన నిఖిల్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. నాని ఫ్లెక్సీ తప్ప మరొక పార్టీ వ్యక్తుల వారివి ఉండకూడదని దామినేడుకు చెందిన పులివర్తి నాని అనుచరుడు రాఘవ అక్కడ రచ్చ చేశాడు. ఫ్లెక్సీని తీసివేయాలని హుకుం జారీ చేశాడు. నిఖిల్‌ పట్టించుకోకపోవడంతో రాఘవతో పాటు అతని అనుచరులు నిఖిల్, అతని ఫ్రెండ్‌ వంశీపై రాడ్‌లు, కత్తులు, కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర రక్త గాయాలతో ఉన్న నిఖిల్, వంశీని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. పులివర్తి నాని అనుచరుడు రాఘవపై తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భయపెడుతున్న కొత్త సంస్కృతి
ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతోనే దాడుల సంస్కృతి పెరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరికి వచ్చిన కొత్త సంస్కృతి వల్ల పల్లెల్లో ప్రశాంతత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకుడు ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడని మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ దాడులు, హత్యయత్నం ఘటనలపై చిత్తూరు, తిరుపతి అర్భన్‌ ఎస్పీలు సీరియస్‌ అయ్యారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త సంస్కృతిని చంద్రగిరి నుంచి తరిమివేయాలని, ప్రోత్సాహించే నాయకులకు తగిన గుణపాఠం తప్పదని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు