దేవుడి ముసుగులో.. పర్యాటక స్థలం ఆక్రమణ

10 Mar, 2019 16:51 IST|Sakshi
చింతపల్లి తీరంలో ప్రహరీనిర్మించి ఆక్రమించిన పర్యాటక స్థలం

బరి తెగించిన అధికార పార్టీ నాయకులు

చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న    అధికార యంత్రాంగం

పూసపాటిరేగ: ఆడ పిల్ల.. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా దీనినే అనుసరిస్తున్నారు. ఆక్రమించేందుకు ఏదైతే ఏం అన్న రీతిలో బరితెగిస్తున్నారు. చింతపల్లి సముద్రతీరంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పర్యాటక స్థలానికి నిర్మించి ఆక్రమించాడు. తొలుత పర్యాటక స్థలానికి ఆనుకొని గుడితో పాటు ప్రహరీ కూడా నిర్మించాడు. ఆ తరువాత పర్యాటకంగా ఆ ప్రదేశం అంతా అభివృద్ధి చెందడంతో గుడి చుట్టూ ఉన్న సుమారు 50 సెంట్లు స్థలంపై ఆయన కన్నుపడింది. వెంటనే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు కూడా ఎత్తేశాడు.

చింతపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 115లో వున్న పర్యాటక శాఖ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలోనే ప్రహరీ నిర్మించాడు. ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా పర్యాటక శాఖ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే నిర్మాణాలు జరిగా యా అని చర్చించుకొంటున్నారు. చింతపల్లి బీచ్‌కు వచ్చే పర్యాటకులు వాహనాలు పార్కింగ్‌కు ఉంచే స్థలంలో ని ర్మాణాల జరిగినా పట్టించుకోవడం లేదు. చింతపల్లి పం చాయతీలో అధికార పార్టీకి చెందిన కీలకనేత కావడంతో ప్రజలు అడిగే సాహసం చేయలేపోతున్నారు.

పర్యాటకశాఖ అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లం అవడంతో కన్ను పడిందే తడువుగా స్థలాన్ని కబ్జా చేశారు. విచారణ ఆదేశించాలని మత్స్యకార నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకశాఖకు చెందిన స్థలాన్ని అధికారపార్టీ నాయకుడు నుంచి కాపాడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ రామారావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.         

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

చింతపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకశాఖ స్థలాన్ని కబ్జాచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలి.
                                       – ఎం.శ్రీనువాసురావు, సామాజిక కార్యకర్త

పర్యాటక భవనాలు ప్రారంభించాలి

సుమారు కోటి రుపాయల నిధులతో నిర్మించిన పర్యాటక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి టూరిజం  భవనాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి.
                – మహంతి జనార్దనరావు, పూసపాటిరేగ  

మరిన్ని వార్తలు