ర్యాగింగ్‌పై మంత్రివర్గం స్పందించేనా?

31 Jul, 2015 03:41 IST|Sakshi
ర్యాగింగ్‌పై మంత్రివర్గం స్పందించేనా?

* రిషితేశ్వరి మృతి కేసుపై ప్రభుత్వ ఉదాశీనత
* క్యాబినెట్‌లో చర్చిస్తామన్న మంత్రి గంటా మాటలు.. ఒట్టిదేనా
?
సాక్షి, గుంటూరు: ర్యాగింగ్ కోరలకు బలైన విద్యార్థిని రిషితేశ్వరి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. మొక్కుబడిగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి చర్యలపైనా పెద్దగా స్పందిస్తున్న దాఖలాల్లేవు. ఘటన జరిగినప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విద్యార్థిని మృతిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ స్పందించడంలేదు.

దీంతో ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రిషితేశ్వరి మృతి అనంతరం ఈ నెల 18న వర్సిటీకి వచ్చిన ఏపీ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి హడావుడి చేశారు. ర్యాగింగ్‌పై ఏపీ సీఎం సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకొస్తామని, దీనిపై ఈనెల 22న రాజమండ్రిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ విషయాలన్నీ విలేకరులకు, ఫోన్‌లో మాట్లాడి రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణకు చెప్పారు. అయితే ఈ నెల 22న జరిగిన క్యాబినెట్ భేటీలో ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు తెచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో మంత్రి మాటలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా రిషితేశ్వరి వ్యవహారంపై చర్చించి, ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు చేయాలని నిర్ణయిస్తారా అన్నది అనుమానంగానే ఉంది.
 
బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని మొండి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.గోపీచంద్ ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు. నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన డైరీ అందనందువల్ల వాయిదా కావాలని ఏపీపీ కె.రామచంద్రరావు కోరారు. దీంతో పిటిషన్‌ను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిషితేశ్వరి మృతి కేసులో దుంపా హనీషా, దారావత్ జైచరణ్, నరాల శ్రీనివాస్‌లను దోషులుగా పేర్కొంటూ పెదకాకాని పోలీసులు వారిని ఈ నెల 16న అరెస్టుచేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 31 వరకు వారికి రిమాండ్ విధించారు.

మరిన్ని వార్తలు