నిరాశపర్చిన రైల్వే బడ్జెట్

28 Feb, 2015 02:03 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ
అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్‌లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త రైల్వే లైన్లు, సర్వేలన్నీ అటకెక్కాయని అన్నారు.
 
 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ తయారీ కేంద్రం.. గతంలో మమతాబెనర్జీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన వ్యాగన్ ఫ్యాక్టరీ.. ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేనేలేదన్నారు. ఖాజీపేటను రైల్వే డివి జన్‌గా ప్రకటించాలన్న కోరికనూ మన్నించలేదని చెప్పారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,200 కోట్లు ఖర్చువుతుండగా.. బడ్జెట్‌లో రూ.27.44 కోట్లు కేటాయించారన్నారు. అయినా సీఎం మాత్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు.
 
 ఆయన కుమార్తె ఎంపీ కవిత ఫరవాలేదన్నట్లు మాట్లాడటం అర్థరహితమన్నారు. మహానేత దివంగత సీఎం వైఎస్సార్ ఆనాడు కేంద్రమంత్రి పదవులకన్నా బడ్జెట్‌లో ఏపీకి అగ్రస్థానం ఉండాలని కోరారని గుర్తు చేశారు. ఒకనాడు కేంద్రమంత్రి పదవి త్రుణప్రాయంగా వదిలిన కేసీఆర్ ఇప్పుడెందుకు బడ్జెట్‌పై స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ప్రధానిని కలసి తెలంగాణ ప్రజల రోదన వినిపిస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ మజ్‌తబ అహ్మద్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు