ఈసారైనా పట్టాలెక్కేనా?

12 Feb, 2014 00:02 IST|Sakshi

మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేసిన సమయంలో సంగారెడ్డి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాటి నుంచి జిల్లా కేంద్రానికి రైల్వేలైన్ ఏర్పాటు నేతల హామీగానే మిగిలింది. రైల్వేలైన్‌తోపాటు సంగారెడ్డికి ఎంఎంటీఎస్ లైన్ పొడిగింపు హామీలు ఇంత వరకు నెరవేరలేదు. తాజాగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు అంశం తెరపైకి వచ్చింది.
 మూడు దశాబ్దాలుగా..
 జోగిపేట రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత వాసులు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, అక్కన్నపేట మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా లాభం లేకుండా పోయింది. 2012లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పను కలిసి జోగిపేట రైల్వే లైన్ ఏర్పాటుకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలల్లో సర్వే చేయిస్తానని హమీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగకపోవడంతో ఈ ప్రాంత వాసులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

 ఎంఎంటీఎస్ పనులతో కాస్త ఊరట..
 పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పటాన్‌చెరుకు రైలు సౌకర్యం కలగానే మిగిలింది. దివంగత నేత మల్లికార్జున్ కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో పటాన్‌చెరుకు రైల్వే లైను వేయించారు.  రెండేళ్ల క్రితం రూ.33 కోట్లతో ఎంఎంటీఎస్ సౌకర్యానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా జరుగుతున్నాయి. రైల్వే లైన్‌కు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వరకే ఎంఎంటీఎస్‌ను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ రహదారి మీదుగా పాత రైల్వే లైను ఉన్న కారణంగా ఆర్సీపురం వరకే ఎంఎంటీఎస్‌ను కుదించారు. పటాన్‌చెరు మీదుగా మెదక్‌కు రైల్వే లైను వేస్తామని గతంలో బడ్జెట్‌లో చూపారు. కాని నేటికి ఆ సర్వే పనులు జరగలేదు. మియాపూర్ వరకు ఉన్న మెట్రోను లింగంపల్లి వరకైనా పొడిగించాలని స్థానికుల నుంచి డిమాండ్ ఉంది.

 మెదక్ లైన్‌కు  ప్రతిపాదిత నిధుల కోసం..
 మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన రూ.129.32 కోట్ల నిధులపై మెదక్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత మూడు బడ్జెట్‌లలో ఆశించిన మేర నిధులు మంజూరు కాలేదు.

 మూడేళ్లుగా పెండింగ్‌లోనే..
 జహీరాబాద్ రైల్వేస్టేషన్‌లో గత మూడేళ్లుగా పలు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్‌లో రైళ్ల క్రాసింగ్ సమయంలో రెండో ఫ్లాట్ ఫారం లేకపోవడంతో రైల్లోకి ఎక్కి, దిగే సమయంలో అవస్థలు పడుతున్నారు.

 బోధన్-బీదర్ మార్గం కోసం..
 బోధన్-బీదర్ రైల్వే లైన్ కోసం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంపీ షెట్కార్ చొరవతో బోధన్-బీదర్ మార్గంలో కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి కల్హేర్ మండలం మహదేవుపల్లి మీదుగా లైన్ కోసం రెండేళ్ల క్రితమే సర్వే చేశారు. ఈ లైన్ ఏర్పాటైతే బాన్స్‌వాడ, జుక్కల్, నారాయణఖేడ్ నియోజక వర్గాల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.

 సర్వే పూర్తయి నాలుగేళ్లయినా..
 సిద్దిపేట నూతన రైల్వేమార్గం కోసం నాలుగేళ్ల క్రితం తాత్కాలిక సర్వే కోసం రూ.40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సిద్దిపేట ఊసెత్తక పోవడం గమనార్హం. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో సిద్దిపేట రైల్వేమార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూసేకరణ, రాష్ట్ర వాటాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా రైల్వేలైన్ నిర్మాణం నుంచి ఐదేళ్ల వరకు ఆ మార్గంలో ఎదురయ్యే ఆర్థిక నష్టాలను భరించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సిద్దిపేట లైన్‌కు మోక్షం కలగడం లేదు.
 

మరిన్ని వార్తలు