రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం

15 May, 2017 01:35 IST|Sakshi
రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం

- నాలుగు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం
- ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి


తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): పేద ప్రజలకు కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆదివారం ‘రాజన్న’ మొబైల్‌ క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేవలం నాలుగు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. 2004లో మే 14వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజన్న క్యాంటీన్‌ పేరుతో భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

365 రోజులూ ప్రతి పేదవాడికీ శ్రేష్టమైన భోజనం అందేలా తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం కనుక క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మసీదు సెంటర్‌ వద్ద ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయికే నాలుగు ఇడ్లీలు ఇచ్చే పథకం ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పరిశీలించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కమిటీలను పంపించారని, ఇప్పటికి మూడేళ్లు గడిచినా పథకం రూపు దాల్చలేదన్నారు.

>
మరిన్ని వార్తలు