మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా

11 Dec, 2023 15:08 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు.  

‘‘స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను ఇచ్చా. నా రాజీనామాను ఆమోదించాలని కోరాను. వ్యక్తిగత కారణాలతోనే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నా.  2014 నుంచి రెండుసార్లు మంగళగిరి నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశా’’ అని తెలిపారాయన.  

.. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌ కోసం పనిచేశా. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీటు ఆశించాను.  కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఇవ్వలేదు.  2009లో పెదకూరపాడు సీటును ఆశించాను.  కానీ దక్కలేదు. రెండు సార్లు సీటు రాకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేశా’’ ఆయన గుర్తు చేసుకున్నారు.

పర్సనల్‌గా మాట్లాడతా.. స్పీకర్‌ తమ్మినేని
ఆర్కే రాజీనామా పరిణామంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆర్కే రాజీనామా లేఖ అందిందని, అ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. అలాగే  ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి ఉందని, ఆపై రాజీనామా లేఖ సరైన ఫార్మట్‌లో ఉందా? లేదా? అనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ తెలిపారు. అలాగే.. అసంతృప్తితోనే ఆర్కే రాజీనామా చేశారన్న ప్రచారాన్ని స్పీకర్‌ తమ్మినేని ఖండించారు. అలా అసంతృప్తితో ఉంటే సీఎం జగన్‌తో సన్నిహితంగా ఎందుకు ఉంటారని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారాయన.

>
మరిన్ని వార్తలు