అంతా కట్టుకథ!

18 Apr, 2018 09:57 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ  పాలరాజు 

దివ్యాంగురాలిపై సామూహిక లైంగికదాడి అవాస్తవం

భౌతిక, సాంకేతిక ఆధారాల సేకరణ

వివరాలు వెల్లడించిన ఎస్పీ పాలరాజు  

విజయనగరం టౌన్‌ : దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి ఘటన కట్టుకథగా తేలింది. పూసపాటిరేగ మండలానికి చెందిన దివ్యాంగురాలిని  నెల్లిమర్ల మండలం సారిపల్లికి  వెళ్లే  నిర్జన ప్రదేశంలో  ఆటోడ్రైవర్‌ మరొక ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు  ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అదంతా దివ్యాంగురాలు అల్లిన కట్టుకథేనని తేలింది. ఈ మేరకు  ఎస్పీ జి.పాలరాజు  జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు.  

దివ్యాంగురాలి లైంగిక దాడి కేసుకు సంబంధించి  జిల్లాలోని ముగ్గురు  డీఎస్పీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, ఒక్కో బృందానికి భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలు సేకరించాలని, కుటుంబ నేపథ్యం, శాస్త్ర, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. బాధితురాలి కథనం ప్రకారం ఆమె ఆటో ఎక్కిన ప్రాంతాలను, సంఘటనా స్థలంగా చెప్పబడిన సారిపల్లిలోని నిర్జన ప్రదేశాన్ని సందర్శించారు. ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయిన తర్వాత బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా, శిశు సంక్షేమ అధికారుల సమక్షంలో నమోదు చేశారు.  

బాధితురాలు పట్టణంలో ఎక్కువ సమయం గడిపి ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు తనను తిడతారని భావించి, పొంతన లేని విషయాలను చెప్పినట్టు నిర్ధారణ జరిగిందని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తు చేయడంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, విజిలెన్స్‌ మోనటరింగ్‌ సభ్యులు, మీడియా సభ్యులు, దళిత నాయకులు, పోలీస్‌ శాఖకు సహకరించారన్నారు. కేసు మిస్టరీని చేధించడంలో తీవ్రం గా శ్రమించిన డీఎస్పీలు టి.సౌమ్యలత, టి.త్రినాథరావు, ఎవి.రమణ, రూరల్‌ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐలు రామకృష్ణ, ఉపేంద్ర, నారాయణరావు, ఇతర పోలీస్‌ అధికారులను ఎస్పీ అభినందించారు.  

పోలీసుల విచారణలో వెలుగు చూసిన అంశాలు


  • సంఘటనా స్థలానికి ఆటో వెళ్లే అవకాశం లేదు.

  • నెల్లిమర్లకు వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ పుటేజీలలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. 

  • సంఘటన జరిగిన సమయాల ప్రకారం చూస్తే  అవే సమయాల్లో బాధితురాలు పూర్తిగా విజయనగరం పట్టణంలోనే ఉన్నట్టుగా ఆమె ఫోన్‌ టవర్స్‌ రావడం.

  • బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు, వాస్తవ సంఘటనకు పొంతన లేకుండాపోవడం.

  • బాధితురాలు ఫోన్, బ్యాగ్‌ను ఆటోలో విడిచిపెట్టినట్టుగా ముందుగా తెలిపినప్పటికీ, సదరు వస్తువులు ఆమె ఇంట్లోనే పోలీసు విచారణలో లభ్యం కావడంతో  బాధితురాలు వాస్తవాలను అంగీకరించక తప్పలేదు.  
  • వైద్యులు బాధితురాలికి నిర్వహించిన  పరీక్షలలో ఆమె శరీరంపై బాహ్యంగాగానీ, లోపలగానీ ఎటువంటి గాయాలు లేనట్టు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు