సీఎం నిర్ణయం కార్మికులకు పండగ

4 Sep, 2019 14:10 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో బుధవారం వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల కల నిజం కాబోతోందని సంతోషాన్ని వెలిబుచ్చారు. రూ.7 వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సీఎం ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పరనటానికి ఈ నిర్ణయం సాక్ష్యంగా నిలిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే సీఎం చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు ఒక పండగ అని తెలిపారు.

‘చంద్రబాబు హయంలో ఆర్టీసీ నష్టపోయింది’ అని రవీంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన సొంత కార్యక్రమాలకు ఆర్టీసీని వాడుకోవడమేకాక ప్రైవేటుపరం చేయాలని చూశారని ఆరోపించారు. ఆర్టీసీ అస్తులను అమ్మిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్టీసీని, ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇక విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఆర్టీసీ ఉద్యోగులకు అలాంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు