'రాజధానికి రాయలసీమే అనువైనది'

6 Jul, 2014 20:38 IST|Sakshi
'రాజధానికి రాయలసీమే అనువైనది'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రాయలసీమ ప్రాంతమే అనువైనదని ఆ ప్రాంత నేతలు పలువురు  అభిప్రాయపడ్డారు. తమ ప్రాంతాన్నే రాజధానిగా ప్రకటించాలని రాయలసీమవాసులు డిమాండ్‌చేశారు. రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సభ నిర్వహించారు. ఈ సభకు పలువురు నిపుణులు, విద్యార్థులు, విశ్లేషకులతోపాటు రాజకీయ నేతలు హాజరయ్యారు. రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అక్కడ ఇక్కడ అంటూ రియల్‌ ఎస్టేట్  వ్యాపారులకు దన్నుగా నిలుస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ నేత మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.

 రాయలసీమ అభివృద్ది రాజధానితోనే సాధ్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు.  రాష్ట్రం రూపుమారిన ప్రతిసారీ సీమకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందన్నారు.  రాష్ట్ర విభజన బిల్లులో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునేదిని హెచ్చరించారు.  రాజధానికి, అభివృద్దికి సంబంధంలేదని సీపీఎం నేత రాఘవులు అన్నారు.  ఒక్క రాజధాని వచ్చినంత మాత్రాన అభివృద్ది జరగదని చెప్పారు. ఇప్పటి వరకు జరిగినట్లు కాకుండా అన్ని జిల్లాలు లాభపడేలా నిర్ణయం జరగాలన్నారు.

 రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలంతా ఒకే అభిప్రాయంతో ఉండాలని రిటైర్డ్‌ డిజి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాయలసీమ కిందకే వస్తుందని, అక్కడ లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నందున దోనకొండను రాజధానిగా చేస్తే బాగుంటుందని సూచించారు. శ్రీభాగ్ ఓడంబడిక ప్రకారం కర్నూలుకే రాజధాని దక్కాల్సి ఉందని నీలం సంజీవరెడ్డి మనుమరాలు రాయలసీమ రాజధాని సాధన సమితి మహిళా నేత శైలజ అన్నారు.  అయితే సీమ ప్రయోజనాల దృష్ట్యా సీమ జిల్లాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పారు.

బాధ్యతగల ప్రభుత్వం రాజదాని ఏర్పాటు విషయంలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.  కొంత మంది తమ వారికోసమే అభివృద్దిచెందిన ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు పావులు కదుపుతోందని ఆరోపించారు. రాజధాని ఏర్పాటు కోసం వేసిన కమిటీ పర్యటిస్తుండగానే తమకు చెందిన కొంత మంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసం లీకులిస్తూ భూముల ధరలు ప్రభుత్వం  పెంచుతోందని రాయలసీమ రాజధాని సాధన సమితి నేత లక్ష్మణ రెడ్డి అన్నారు.

ఖాళీ భూములు ఉన్నంత మాత్రాన రాయలసీమకు రాజదాని అనగానే సరిపోదని పలువురు అభిప్రాయపడ్డారు. నీరు లేకుండా అభివృద్ది అన్నది అసాధ్యమని అభిప్రాయపడ్డారు. నీరు లేకుండా కంపెనీలు రావాలన్నా కూడా కంపెనీలు వచ్చే అవకాశం లేదని రాయలసీమ అభ్యుదయ వేదిక నేత దశరథరామిరెడ్డి అన్నారు. రాయలసీమ రాజధాని కోసం ఏకభిప్రాయంతో పోరాడాలని ఈ సమావేశంలో  నిర్ణయించారు.

మరిన్ని వార్తలు