మేడిన్‌ చైనా ... మాదే నాయనా!

20 Jan, 2018 10:54 IST|Sakshi

భారత్, చైనా భాయీ భాయీ అన్నది పాత నినాదం...

మేమూ, చైనా కంపెనీ భాయీ భాయీ అనేది ఓ టీడీపీ ఎంపీ విధానం!

సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం.

ఇదీ ప్రాజెక్టు
అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు వేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్‌ ఫైబర్‌గ్రౌండ్‌(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్‌కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది.

చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
చైనాకు చెందిన ఎస్‌బీజీ అనే కంపెనీ వీటికి టెండర్‌ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు.

రెండు అర్హతలు తప్పనిసరి...
అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్‌లో ఇన్‌కార్పోరేట్‌ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు.

అనుమతించాల్సిందే... టెండర్‌ కట్టబెట్టాల్సిందే
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్‌కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్‌కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్‌కోలో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు