జీవో 43ను గౌరవించాల్సిందే:హైకోర్టు

31 Jul, 2014 02:27 IST|Sakshi
జీవో 43ను గౌరవించాల్సిందే:హైకోర్టు

హైదరాబాద్: రవాణా వాణిజ్య వాహనాలు 2015 మార్చి 31వ తేదీ వరకు త్రైమాసిక మోటారు వాహన పన్నును ఏ రాష్ట్రంలో చెల్లించినా కూడా ఆ వాహనాలు రెండు రాష్ట్రాల్లోనూ తిరిగే వెసులుబాటు కల్పిస్తూ ఈ ఏడాది జూన్ 1న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 43ను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ జీవోకు విరుద్ధంగా ఏ అధికారి కూడా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఒకవేళ ఎవరైనా అధికంగా పన్ను చెల్లించి ఉంటే, అది తామిచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తెలిపింది.

ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు, మాక్సీ క్యాబ్‌ల నుంచి మోటారు వాహన పన్ను వసూలు చేసే విషయంలో వివరణనిస్తూ తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

మరిన్ని వార్తలు