చాకిరేవే చావు రేవైంది..

24 Jun, 2014 02:07 IST|Sakshi
చాకిరేవే చావు రేవైంది..

చాకిరేవే చావు రేవైంది..
 
ముదినేపల్లి : అభం శుభం తెలియని ఇద్దరు బాలికలు చెరువులో బట్టలు ఉతికేం దుకు వెళ్లి నీట మునిగి దుర్మరణం పాలైన హృదయ విదారక సంఘటన మండలంలోని గురజలో సోమవారం జరిగింది. గురజ ఎస్టీ కాలనికి చెందిన డేగల నాగరాజు, అనంత దంపతులకు నలుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమారై చిన్నమ్మ (13) మూగబాలిక. స్థానిక హోటల్‌లో పనిచేస్తోంది.

మూడో కుమారై మాధవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాలాలో మూడో తరగతి చదువుతోంది. వీరు రోజూ స్థానికంగా ఉన్న చాకిరేవులో బట్టలు ఉతికేందుకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోమవారం రెండో పూట చిన్నమ్మ హోటల్ పని నుంచి, మాధవి స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. అనంతరం రెండు బకెట్లలో బట్టలు తీసుకుని చెరువు వద్దకు వెళ్లారు.

బట్టలు ఉతికేందుకు వెళ్లిన కుమారైలు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టుపై బట్టలతో ఉన్న బకెట్లు మాత్రమే కనిపించాయి. సమీపంలో ఉన్న కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని ఆరా తీశారు. అయితే వారు తమ ఇళ్లకు రాలేదని బంధువులు చెప్పడంతో అనుమానం వచ్చి చెరువులో గాలిం చగా బాలికల మృతదేహాలు లభిం చాయి. వాటిని చూసిన తల్లిదండ్రులు భోరున విలపించారు.

ఈ సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం.సూర్యారావు, ఆర్‌ఐ జి.గౌతమ్‌కుమార్, సర్పంచి కె.వెంకటేశ్వరరావు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శేవా నాగజగన్‌బాబూరావు, గురజ ఎంపీటీసీ మాజీ సభ్యుడు జోగి శివప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ పరంగా బాధితులకు సహాయం అందించేందుకు కృషిచేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు