ఏసీబీ దాడులు చేస్తున్నా ..

19 Nov, 2019 08:48 IST|Sakshi
రెవెన్యూలో లంచాల బాగోతం

మారని అధికారులు, సిబ్బంది తీరు 

మూడేళ్లలో 13 మంది కటకటాలపాలు 

సాక్షి, కర్నూలు: ఈ ఏడాది సెపె్టంబర్‌ 23న ఓర్వకల్లు తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంటు నరాల సంజీవరెడ్డి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అక్టోబర్‌ 10న సంజామల తహసీల్దార్‌ గోవింద్‌ సింగ్‌ ఈ– పట్టా కోసం రెడ్డిపల్లికి చెందిన నరసింహారెడ్డి నుంచి రూ.5 వేలు   లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  నవంబర్‌ 8న గూడూరు తహసీల్దార్‌ షేక్‌ హసీనా తరఫున ఆమె సమీప బంధువు మహబూబ్‌బాషా గూడూరుకే చెందిన డమామ్‌ సురేష్‌  నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనితో పాటు తహసీల్దార్‌పై కేసు నమోదు చేశారు.

తహసీల్దార్‌ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండిపోయారు.ఈ నెల 16న కల్లూరు మండల ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏ మద్దిలేటి ఏసీబీకి పట్టుబడ్డారు.  ఈ నెల 17న కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయంలో మామూళ్ల పంపకంలో వచ్చిన తేడా కారణంగా జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయలు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటనలన్నీ రెవెన్యూ శాఖలో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన అవినీతి బాగోతాలను తేటతెల్లం చేస్తున్నాయి. ప్రతి నెలా ఏదో ఒకచోట రెవెన్యూ అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వాటాల పంపకాల్లో తేడా కారణంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది కొట్టుకునే స్థాయికి వెళుతున్నారు. దీనివల్ల ఆ శాఖ పరువు గంగలో కలసి పోతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడంలేదు.  

వరుస దాడులు చేస్తున్నా.. 
రెవెన్యూ శాఖలో మండల స్థాయి నుంచి జిల్లా పరిపాలన కార్యాలయం వరకు అవినీతి కంపు కొడుతోంది. మూడేళ్లలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 13 మంది అధికారులను ఏసీబీ పట్టుకుంది. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఆన్‌లైన్‌ పట్టాదారు పాసుపుస్తకం, అడంగల్, 1బీ, ఇతర ఫారాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు. జిల్లాలో 6.94 లక్షల మంది రైతులు(పట్టాదారులు) ఉన్నారు. వీరిలో 6.39 లక్షల మంది వరకు వివరాలను ఆన్‌లైన్‌ చేసి 1బీ ఇచ్చారు. మిగిలిన వారిని తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, వివరాల ఆన్‌లైన్‌కు తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వారి పనిని నిరీ్ణత సమయంలో పూర్తి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. అయితే వారికి మామూళ్లు ఇవ్వకపోతే పని కావడంలేదు. చిన్న పనికైనా కనీసం రూ.5 వేలు తీసుకుంటున్నారు.

అదే వివాదాల్లో ఉన్న భూములైతే వాటి విలువలో 5–10 శాతం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గూడూరు తహసీల్దార్‌ రూ.8 లక్షలు డిమాండ్‌ చేసి.. చివరకు రూ.4 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో గోనెగోండ్ల మండలంలో ఓ వీఆర్వో డబ్బు తీసుకుని కూడా పని చేయకపోవడంతో కులమాలకు చెందిన రైతు చేతిలో దెబ్బలు తిన్నాడు. ఇటీవల దేవనకొండలో ఓ రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయడానికి వీఆర్వో రూ.60 వేలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి..బహిర్గతపరిచాడు.  ఇలాంటి ఘటనల కారణంగా రెవెన్యూ శాఖ పరువు పోతోంది. కాగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పరితపిస్తున్నారు. అందులో భాగంగా రైతులు, ఇతరులను లంచాల కోసం పీడించే అధికారులపై నిఘా ఉంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు.  దీంతో ఏసీబీ వరుస దాడులు చేస్తోంది. అవినీతిపరులు ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని, వారి భరతం పడతామని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

బాధ్యతను మరచి పనిచేస్తే ఉపేక్షించేది లేదు 
రెవెన్యూ సిబ్బంది కార్యాలయం లేదా క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇది వారి బాధ్యత. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరించినా...అవినీతికి పాల్పడినా లేదా శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించినా ఉపేక్షించబోం. కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయంలో గొడవ పడిన  వీఆర్వోలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలను సస్పెండ్‌ చేశాం. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నాం.
– జి. వీరపాండియన్, కలెక్టర్‌   

మరిన్ని వార్తలు