రిమ్స్ రూటే సెపరేటు

31 May, 2015 02:16 IST|Sakshi

 రోజుకో జీవోతో అక్కడి ఉద్యోగుల్లో గందరగోళం
 ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్నా కదలలేని పరిస్థితి
 ఆన్‌లైన్‌లో ఖాలీలను నమోదు చేయాలని ఉద్యోగుల డిమాండ్
 
 శ్రీకాకుళం సిటీ :జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడినెలకంటే.. వైద్య, ఆరోగ్యశాఖలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు. అందునా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) నర్సింగ్ సిబ్బంది బదిలీలపై విడుదలవుతున్న జీవోలపై స్పష్టత లేకపోవడంతో వారంతా సతమతమవుతున్నారు. బదిలీల ప్రక్రియ మొద లైనప్పటి నుంచి కోరుకున్నచోటకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా రోజుకో జీవో విడుదలవుతుండటంతో తలలు పట్టుకోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఉదయం ఒక జీవో వెలువడగానే, రాత్రికి మరో జీవో వెలువడుతోందని చెబుతున్నారు. దీనికి తోడు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఖాళీల ప్రక్రియను తొలుత చూపించగా ఇప్పుడు మూడు రోజులుగా వాటిని కూడా చూపించడం లేదంటూ రిమ్స్ నర్సింగ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
 
 రిమ్స్‌లో సుమారు 230 వరకు నర్సింగ్ సిబ్బంది విధులను నిర్వర్తిస్తుండగా బదిలీలకు అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకున్నారన్నారు. విశాఖ కేజీహెచ్‌లో, ఘోషా ఆస్పత్రి, మెంటల్ ఆస్పత్రిలో తొలుత ఖాళీలను చూపించినా ప్రస్తుతం ఆన్ లైన్‌లో వాటిని అధికారులు  చూపించడం  లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 75 మంది సిబ్బంది నకిలీ సర్టిఫికెట్స్ సంపాదించుకొని వారిని అక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వీరు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆన్‌లైన్‌లో ఖాళీలను చూపించడం లేదంటూ చెబుతున్నారు. దీనికి తోడు ఇంత సీనియారిటీ ఉండి దరఖాస్తు చేసుకుంటే విశాఖపట్నంలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వేసేందుకు కొందరు ముందస్తు చర్యలు ప్రారంభించడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆన్‌లైన్‌లో ఖాళీలను నమోదు చేయాలని, అర్హులై న సిబ్బందికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు