అక్రమ సస్పెన్షన్‌లు రద్దు చేయాలి

31 May, 2015 02:18 IST|Sakshi

ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికుల ధర్నా
 
 హన్మకొండ : ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఉద్యోగుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సూపర్‌వైజర్‌లకు ఇచ్చిన చార్జిషీట్‌లు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండలోని ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఆర్ రెడ్డి, వరంగల్ రీజియన్ కార్యదర్శి ఈఎస్ బాబు మాట్లాడుతూ తొర్రూరు డిపోలో అద్దె బస్సుల అగ్రిమెంట్ ప్రతిని డిపో మేనేజర్ కార్యాలయానికి, అకౌంట్ ఆఫీస్‌కు పంపలేదని దీంతో పాత ధరలతో అద్దె బస్సులకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

అద్దె బస్సులకు చెందిన వివరాలు జూనియర్ అసిస్టెంట్‌లకు అందించక పోవడంతోపాటు, అద్దె బస్సులకు చెల్లింపులపై అవగాహన సదస్సు, శిక్షణ ఇవ్వలేదన్నారు. అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కింది స్థాయి సిబ్బందిని బలిచేస్తున్నారని మండిపడ్డారు. యాజమాన్యం జారీ చేస్తున్న సర్క్యులర్‌లు సకాలంలో సిబ్బందికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అరవ సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం అద్దె రేట్లు తగ్గించాల్సి ఉందని, అగ్రిమెంట్‌ను సంబంధిత సెక్షన్ చూసే సిబ్బందికి అందించక పోవడంతోనే ఈ చెల్లింపులు జరిగాయని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. చిరుద్యోగులను ఎలా సస్పెండ్ చేస్తారని అన్నారు. తక్షణమే సస్పెన్షన్, చార్జీషీట్లు రద్దు చేయకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో టీఎంయూ నాయకులు, కార్మికులు రాజేశ్వర్‌రావు, పి.వి.రెడ్డి, బి.జాకబ్, ఇ.రామ్మోహన్, కె.రవీందర్‌రావు, రంజిత్, ప్రసాద్, ఓంప్రకాశ్, నిజాముద్దీన్, సుభాష్, లింగాచారి, సిఆర్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు