సీఏఏపై అపోహలు తొలగించేందుకు కరపత్రం

5 Jan, 2020 13:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముస్లింలలో అపోహలు రేకెత్తించడానికి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర విద్యుత్‌ ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ఆరోపించారు. ప్రజలు వారి ఉచ్చులో పడవద్దని కోరారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అపోహలు తొలగించేందుకు తయారు చేసిన కరపత్రాన్ని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆర్కే సింగ్‌ మాట్లాడుతూ.. దేశ విభజన సమయంలో విడిపోయిన ప్రాంతాల్లో ఉండిపోయిన మైనారిటీలు వివక్షకు, హింసకు గురై మన దేశానికి వస్తే వారికి పౌరసత్వం ఇవ్వాలని చట్టం నిర్దేశిస్తోందన్నారు. అక్కడ నేరాలు చేసినవారికి లేదా ఇక్కడ నేరాలు చేయడానికి వచ్చేవారికి పౌరసత్వం ఇవ్వడం ఈ చట్టం లక్ష్యం కాదని తెలిపారు. దేశ పౌరులకు దీనికి సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఇది పార్లమెంట్‌ ద్వారా ఆమోదం పొందిన చట్టమన్నారు. కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించి, అక్కడి అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే ఒరిగేదేం లేదన్నారు. అన్ని రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేసి తీరాలని స్పష్టం చేశారు.

సీఏఏ అమలు చేయని రాష్ట్రంపై రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం నిర్ణయిస్తుందని ఆర్కే సింగ్‌ తెలిపారు. మాజీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో ఈ చట్టం మీద జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కరపత్రం విడుదల చేశామన్నారు. దేశవ్యాప్తంగా దీన్ని పంపిణీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు