నిర్లక్ష్యపు రేవు

8 Apr, 2019 11:26 IST|Sakshi
రామాయపట్నం వాడరేవు

ఎన్నికల కోసమే హడావుడిగా చంద్రబాబు శంకుస్థాపన

రేవుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు

నాయకులను పీడిస్తున్న అవగాహన లోపం

సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలో వాడరేవు రాజకీయ రంగు పులుముకుంది. అభివృద్ధి గురించి పాలకులు దృష్టి పెట్టలేదు. వివిధ కోణాల నుంచి సాధ్యాసాధ్యాలను విస్మరించారు. ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రామాయపట్నం వాడరేవు పనులకు శంకుస్థాపన చేశారు. ముందు పెద్ద పోర్టు అన్నారు. తర్వాత ఇక్కడ మినీపోర్టు చాలన్నారు. దీర్ఘకాలం నుంచి జిల్లాలో వాడరేవు సాధ్యాసాధ్యాలపై నాయకుల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిత్తశుద్ధి ఉంటే ఏనాడో ఇక్కడ వాడరేవు వచ్చి ఉండేదని, నాటి తరం వారు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకు రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నా వాడరేవు అభివృద్ధిపై అంతగా దృష్టి పెట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ పాపం పాలకులదే. 

ఇది నేపథ్యం... సుమారు 600 మైళ్లు పొడవునా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వరకు సముద్ర తీరం ఉంది. కానీ తీరాన ఎక్కువ చీలికలు లేకపోవడంతో మంచి రేవులు ఎక్కువగా ఏర్పడటానికి వీల్లేకుండా పోయింది. కాలగమనంలో కళింగ పట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, యానాం, నర్సాపూర్, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, మోటుపల్లి, కొత్తపట్నం, కృష్ణపట్నం వంటి వాటిలో కొన్ని వెలిశాయి. కొత్తపట్నం వాన్‌పిక్‌ ఇంకా రూపుదాల్చలేదు. రామాయపట్నం కాంగ్రెస్‌ హయాంలో రెండో దశ వరకు ప్రతిపాదనలపై పరిశీలించారు. చివరకు రామాయపట్నం మినీపోర్టు కిందకు మారింది.

ఇక్కడ కొన్నింటికే గుర్తింపు..
ప్రభుత్వ అజమాయిషీలోని రేవుల విషయానికి వస్తే కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, వాడరేవు, కృష్ణపట్నం రేవులు వస్తాయి. వీటిలో కాకినాడ, మచిలీపట్నం మధ్యతరహా రేవులుగాను, మిగిలినవి చిన్నతరహా రేవులుగాను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం రేవుల అభివృద్ధి విషయంలో మాత్రమే కొంత శ్రద్ధ వహించారు. మిగిలిన రేవులు పేరుకు మాత్రమే. పనులు నిర్వహించడానికి ఎలాంటి వసతులు లేవు. ఒకప్పుడు విదేశ వ్యాపారాన్ని విస్తృతంగా సాగించిన ఈ రేవులు కోస్తా ప్రాంతం వెంట విజయవాడ, చెన్నైల మధ్య బకింగ్‌హాం కాలువ రైలు మార్గాల నిర్మాణం జరిగిన తర్వాత తీర రవాణా వాటి నుంచి పోటీకి తట్టుకోలేకపోయింది.  ఇప్పుడు రూ.1400 కోట్ల వ్యయంతో బకింగ్‌హాం కాలువను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన చేయడం గమనార్హం.

హడావుడిగా శంకుస్థాపన
రామాయపట్నం పోర్టు అభివృద్ధి ప్రతిపాదన దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నా దీనిని ఇప్పుడు ఈ ఎన్నికలకు హడావుడి చేసి రాజకీయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. తగిన సర్వే లేకుండా మినీపోర్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. యూపీఏ చైర్మన్‌గా సోనియాగాంధీ రామాయపట్నం వద్ద రేవు అభివృద్ధిపై అధికారుల బృందం ద్వారా పరిశీలన చేయించారు. పోర్టు సాధ్యాసాధ్యాలపై ఇంకా పూర్తి నివేదికలు రాకముందే..హడావుడి చేసి రామాయపట్నం శంకుస్థాపనలో రాజకీయ ప్రయోజనాలు తప్ప జిల్లా ప్రజలకు ఉపయోగపడేది అంతగా లేదన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నం విషయంలో సమగ్ర సర్వే, ఇప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ముందుకు పోతే మేలైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. 

వాడరేవు కథ
చీరాలకు దగ్గరలో ఐదు మైళ్ల దూరంలో వాడరేవు ఉంది. 1892–93 మధ్యకాలంలో 1949 వరకు సవరించిన బంగాళాఖాతం తీరంలో రామాయపట్నం నుంచి నర్సాపూర్‌ వరకు సూచించే సర్వే చార్టులో దీనిని ఈపూరుపాలెంగా గుర్తించారు. ఆ రోజుల్లో చిన్న పల్లెగా ఉన్న రేవు రెవెన్యూ వ్యవహారాలకు ఈపూరుపాలెం శివార్లలో ఉండడం గమనార్హం. ఈ రేవు నుంచి విదేశాలకు కోస్తా రవాణా చురుకుగా ఈ శతాబ్దం ఆరంభంలో జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. రేవుకు ఉన్న సామర్ధ్యాన్ని గుర్తించి 1933లో తూర్పు తీర వర్తక కంపెనీ ఈస్ట్‌కోస్టల్‌ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఒక సంస్థ రిజిస్టర్‌ చేశారు. రేవు అభివృద్ధి విషయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది.

1944లో యుద్ధ అనంతరం పునర్నిర్మాణ పథకాల కింద అప్పటి మద్రాసు ప్రభుత్వం దాదాపు 1200 మైళ్ల పొడవునా విస్తరించి ఉన్న తీర రేఖలోని రేవుల అభివృద్ధి విషయమై పరిశీలించాల్సిందిగా ప్రెసిడెన్సి పోర్టు ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా ఉంది. పెద్దనౌకలను నిలపడానికి అవసరమైన రేఖ తీరానికి 1.2 మైళ్ల దూరంలో ఉందని కనుగొన్నారు. దీని నిర్మాణానికి సిఫార్సు చేశారు. ఇక్కడి నుంచి వర్తకం పెరిగితే మద్రాసు నష్టపోతుందని ప్రెసిడెన్సి పోర్టు ఆఫీసర్‌ అప్పట్లో  తన నివేదికలో సూచించారు. దీంతో అప్పట్లో మద్రాసు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. 1949లో వాడరేవులోని ప్రభుత్వ రేవు కస్టమ్స్‌ కార్యాలయాన్ని మూసివేశారు.

1957లో ఏర్పడిన వాడరేవు పోర్టు అభివృద్ధి కమిటీ వారి అవిరళ కృషి వల్ల భారత ప్రభుత్వం ఈ రేవును జనవరి ఒకటి 1959న విదేశ వర్తకానికి అనుమతించింది. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయం వాడరేవులో తిరిగి పని చేయడం మొదలైంది. 1960లో రూ.3.5 లక్షల వ్యయంతో హైడ్రోగ్రాఫిక్‌ సర్వే నిర్వహించారు. సర్వే నివేదికలో ఈ రేవు నౌకా రవాణాకు అన్ని విధాలుగా తగిందని పేర్కొన్నారు. ఈ సిఫార్సు తర్వాత సరిహద్దు స్తంభాలు మాష్ట్‌ను నిర్మించారు. ఎగుమతిదారులు సమ్మతించారు. గుంటూరులో జరిగిన సదస్సులో వాడరేవును నిర్మించి అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ చిన్నరేవుల ప్రత్యేకాధికారి ఐజీ ధాకో 1959లో వాడరేవును సందర్శించి నిర్మించడానికి అనువైన స్థలాన్ని నిర్ణయించారు.

1963లో  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిన్న రేవులు అభివృద్ధి సంఘం సమావేశంలో వాడరేవు నిర్మాణం గురించి ఏకగ్రీవంగా తీర్మానించారు. చతుర్ధ పంచ వర్ష ప్రణాళికలో పీర్‌ నిర్మాణానికి రూ.60 లక్షలు నిధులు కేటాయించారు. వాడరేవు రాష్ట్ర తీరరేఖకు దాదాపు మధ్యలో ఉన్నందున ఆంధ్రా, కోస్తా, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఈ రేవు నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి సాలుకు లక్ష టన్నులకు తక్కువ ట్రాఫిక్‌ ఉండవని అంచనా వేశారు.  రోడ్డు, రైలు మార్గాలు అమరి ఉన్నాయి. ఇప్పటికి ఐఎల్‌టీడీ కంపెనీ వరకు ఉన్న బ్రాంచి రైలు మార్గాన్ని సుమారు నాలుగు మైళ్లు పొడిగిస్తే రేవును చీరాల స్టేషన్‌తో కలిపే వీలుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని దిగుమతులను చాలా వరకు చెన్నై నౌకాశ్రయం నిర్వహిస్తోంది. చెన్నై రేవుకు ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించాలంటే వాడరేవు అభివృద్ధి వల్లే సాధ్యపడుతుంది.

మరిన్ని వార్తలు