ఘోర రోడ్డు ప్రమాదం

15 Apr, 2018 08:42 IST|Sakshi
గణేష్‌ మృతదేహం, మృతుడు హరీష్‌

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కంటైనర్‌ 

కృషి ఇన్ఫోటెక్‌ ఉద్యోగులు ముగ్గురు దుర్మరణం  

కదిరి అర్బన్‌ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో చదివి.. ఒకచోట ఉద్యోగంలో చేరిన ఆ ముగ్గురు యువకులు విధి నిర్వహణ కోసం ద్విచక్రవాహనంలో వెళుతుండగా కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురూ దుర్మరణం చెందారు. కదిరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. 

రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన గణేష్‌ (24), తెలంగాణలోని వరంగల్‌ జిల్లా దుర్గండి మండలం వెంకటాపురానికి చెందిన హరీష్‌ (24) బెంగళూరుకు చెందిన కృషి ఇన్ఫోటెక్‌ కంపెనీలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రశేఖర్‌ (25) ఇదే కంపెనీలో సూపర్‌వైజర్‌. నల్లచెరువు మండలం జోగన్నపేట వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను ‘కృషి ఇన్ఫోటెక్‌’ చేపడుతోంది. ఈ ముగ్గురూ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కదిరి పట్టణంలోని హోటల్‌లో భోజనం చేసి సైట్‌ వద్దకు వెళ్లేందుకు ముగ్గురు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. కదిరి – మదనపల్లి మార్గంలో వేదవ్యాస్‌ స్కూల్‌వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణేష్, హరీష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చంద్రశేఖర్‌ను పోలీస్‌ వాహనంలో కదిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ గోరంట్లమాధవ్, తహసీల్దార్‌ పీవీ రమణ పరిశీలించారు. మృతుల్లో ఎవ్వరికీ వివాహాలు కాలేదు.

మరిన్ని వార్తలు